
దుబ్బాకలో పూర్తయిన బాలాజీ దేవాలయ నిర్మాణం
సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న క్షేత్రం
తన్మయత్వం చెందేలా ప్రాంగణం
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లనున్న దేవాలయం
12ఏండ్లుగా రూ.10 కోట్లతో నిర్విరామంగా పనులు
నల్లమల నుంచి ధ్వజస్తంభం..తమిళనాడు నుంచి మూలవిరాట్టు
రేపటి నుంచి దేవాలయ ప్రారంభోత్సవ పూజలు
20న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి, ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆలయవర్గాల వెల్లడి
ఇలలో వైకుంఠం దుబ్బాక పట్టణంలో రూపుదిద్దుకున్న శ్రీహరివాసం. లక్ష్మీసహిత వేంకటేశ్వరాలయం(బాలాజీ దేవాలయం) అత్యద్భుతంగా నిర్మాణం పూర్తయ్యింది. పుష్కరకాలం పాటు పనులు కొనసాగి, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సకల హంగులు అద్దుకుంది. ఆలయ ప్లానింగ్, వాస్తు.. ప్రధానాలయంలో వేయించిన ఫ్లోరింగ్ టైల్స్.. మార్బుల్స్ ఎంపికలో సీఎం ప్రత్యేక శ్రద్ధ ఉంది. రూ.10 కోట్లతో పూర్తయిన ఈ దేవాలయం ప్రారంభోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఆరు రోజుల పాటు జరగనున్న వేడుకలకు దేవాలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. చివరి రోజు ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుండగా, దీనికి సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు ఆధ్యాత్మిక లోకంలో విహరించేలా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు.
దుబ్బాక, ఆగస్టు 13 : సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో లక్ష్మీసహిత వేంకటేశ్వరాలయం(బాలాజీ దేవాలయం) అత్యద్భుతంగా నిర్మాణం పూర్తయ్యింది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సకల హంగులతో దేవాలయం రూపుదిద్దుకుంది. ఆలయ ప్లానింగ్, వాస్తు.. ప్రధానాలయంలో వేయించిన ఫ్లోరింగ్ టైల్స్.. మార్బుల్స్ ఎంపికలో సీఎం ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఆలయ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు దేవాలయ ట్రస్టు సభ్యులు తెలియజేశారు. రూ.10 కోట్లతో దేవాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఇందులో రూ.5.50 కోట్లు సీఎం అందజేశారు. శాశ్వత అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, తదితరులు చేయూతనందించారు. సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామి చేతులమీదుగా దేవాలయాన్ని ప్రారంభించేందుకు ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచనుంది. దేవాలయ నిర్మాణంతో దుబ్బాక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారనుంది. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని అభిమానం. దుబ్బాక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు ప్రత్యేక దృష్టిసారించారు. 12ఏండ్లు సుదీర్ఘంగా దేవాలయ నిర్మాణ పనులు కొనసాగాయి.
అత్యద్భుతంగా దేవాలయ నిర్మాణం..
2009 నవంబరు 1న స్థానిక బస్ డిపో పక్కన రెండెకరాల స్థలంలో దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణానికి త్రిదండి చినజీయర్ స్వామి భూమిపూజ చేశారు. ఆలయ ట్రస్టు సభ్యులు సీఎం కేసీఆర్‌కు బాల్యమిత్రులు కావడంతో నాటి నుంచి ట్రస్టు సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిసి ఆలయ నిర్మాణ పనులను వివరించారు. 2015 జనవరిలో దుబ్బాక పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించారు. అరగంటకు పైగా దేవాలయంలో ఆయన సమీక్షించి, పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నుంచి రూ.3 కోట్లు అందజేయాలని అప్పటి కలెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో నిర్మాణ పనులు పుంజుకొని, నేడు కనుల పండువగా వేడుకలు ప్రారంభం కానున్నాయి.
సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో..
దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో జరిగింది. చినజీయర్ స్వామి సలహాలతో ఆగమ పండితుల పర్యవేక్షణలో పూర్తయ్యింది. నిర్మాణం పూర్తిగా టీటీడీ ప్లానింగ్ వాస్తుతో దేవాదాయ శాఖ ముఖ్య స్తపతి వల్లీ నయగమ్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు. ఆలయ ప్లానింగ్, వాస్తు, ప్రధానాలయంలో వేయించిన ఫ్లోరింగ్ టైల్స్, మార్బుల్స్ ఎంపికలోనూ సీఎం ప్రత్యేక శ్రద్ధ ఉంది. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు ట్రస్టు సభ్యులు తెలియజేస్తూ వచ్చారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.9 కోట్లు ఖర్చు కాగా, అందులో సీఎం కేసీఆర్ రూ.5.50 కోట్లు అందజేశారు. ఇందులో స్పెషల్ డెవలప్మెంట్ (దేవాదాయ శాఖ) నుంచి రూ.3 కోట్లు, కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) నుంచి రూ.1.25 కోట్లు మంజూరయ్యాయి. వ్యాపారులు, భక్తులూ తమవంతుగా సహకారమందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నిర్మాణ పనులను తరుచూ పర్యవేక్షించారు.
ఆరు రోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు
బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
15న(ఆదివారం) మధ్యాహ్నం దుబ్బాక పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్రలో మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ర్టాల కళాకారులతో పాటు స్థానిక భజన, యక్షగాన కళాకారులు, మహిళల కోలాటాలు ఉంటాయి. రాత్రి ఆలయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఆరాధన, పుణ్యాహవాచనం తదితర జరగనున్నాయి.
16న(సోమవారం) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విష్వక్సేన ఆరాధన, అరణి మదనం, శాంతిపాఠం, వేద విన్నపాలు, ఆదివాస హోమం, జలాధివాసం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు..
17న (మంగళవారం) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సేవాకాలం, శాంతిపాఠం, వేద, పురాణ, ఇతిహాస దివ్య ప్రబంధ విన్నపాలు తదితర కార్యక్రమాలు.
18న (బుధవారం) ద్వార తోరణం, ధ్వజకుంభ ఆరాధన, శాంతిపాఠం, చతుర్వేద, పురాణ ఇతిహాస దివ్యప్రబంద విన్నపాలు, మూలమంత్ర హోమాలు, శాంతిహోమం, తదితర కార్యక్రమాలు.
19న (గురువారం) ద్వారతోరణ పూజ, నిత్యహోమం, కార్మాంగస్నపనం పూర్ణాహుతి నివేదన తదితర కార్యక్రమాలు.
20న (శుక్రవారం) ఉదయం 10.28 గంటలకు త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ ఉంటుంది. అనంతరం నయనోన్మీలనం, దృష్టి కుంభం, ప్రథమారాధన, మాత్రాదానం నివేదన, మంగళస్నానం, విన్నపాలు తదితర నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటలకు స్వామివారి ప్రథమ కల్యాణం జరగనున్నది.
తమిళనాడు నుంచి మూల విరాట్టులు.
దుబ్బాక బాలాజీ దేవాలయంలో ప్రతిష్ఠించే లక్ష్మీసహిత వేంకటేశ్వరుల విగ్రహాలను తమిళనాడులోని మహాబలిపురంలో, ఉత్సవ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించారు. ఆలయానికి 60 అడుగుల ఎత్తయిన రాజగోపురం, మొదటి అంతస్తులో బాలాజీ స్వామి వారి విగ్రహం, కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడుమవైపు గోదాదేవి ఆలయాలు నిర్మించారు. ఆలయంలో విష్వక్సేనుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఉపాలయాలను నిర్మించారు. శ్రీమన్నారాయణుడి దశావతార విగ్రహాలను కనువిందు గొల్పుతున్నాయి. కిందిభాగంలో ధ్యానమండపం, ఆలయం వెనుక ప్రవచనాలకు కళావేదిక, ఎడమవైపు నక్షత్ర వనం, రాశీవనం, సరస్వతీవనం, కుడి వైపు సేద తీరడానికి ఉద్యానవనం, పిల్లల కోసం కృష్ణలీలా వనం పార్కును ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం లిప్టు సౌకర్యం కల్పించారు. ఆలయం వద్ద 500మంది భోజనం చేసేలా భోజన శాలను నిర్మించారు. ఆలయం ముందు ప్రతిష్ఠించే ధ్వజస్తంభాన్ని నల్లమల అడవుల నుంచి తెప్పించారు. నీటి గుండం, భజన గది నిర్మించారు. ఆలయంలో కల్యాణ మండపంతో పాటు విశాలమైన అర్చకుల గదులు, లేబర్ గదులు నిర్మించారు.
ఆలయ భూమి పూజ నాటి నుంచే..
ఆలయ భూమి పూజ నుంచే ఇక్కడ నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఏటా కార్తీక మాసంలో దీపారాధన వైభవంగా నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు
దుబ్బాక బాలాజీ దేవాలయాన్ని ప్రారంభించాలని ట్రస్టు సభ్యులు స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కోరి, ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, ఫారూఖ్ హుస్సేన్, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు ఇతర ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. దుబ్బాక పట్టణంలో ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలను వికాస తరంగిణి(మహిళా సభ్యులు) అందజేశారు. ప్రారంభోత్సవానికి సుమారు లక్ష మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసి, ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ర్టానికే ప్రత్యేక గుర్తింపు..
దుబ్బాక బాలాజీ దేవాలయం రాష్ర్టానికే ప్రత్యేక గుర్తింపుగా మారనుంది. 12ఏండ్లుగా నిర్విరామంగా ఆలయ పనులు జరిగాయి. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో, చినజీయర్ స్వామి సూచనలతో నిర్మాణం పూర్తయ్యింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారం మరిచిపోలేనిది. ఆలయానికి వచ్చే భక్తులు తన్మయత్వంతో పులకరించేలా స్వామివారి నిలయం, ఆలయ ప్రాంగణం ఏర్పాటు చేశాం.
అద్భుతంగా నిర్మించాం..
దుబ్బాక బాలాజీ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించాం. ఆలయ నిర్మా ణం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో కొనసాగడం సంతోషంగా ఉంది. ఈ ఆలయం దుబ్బాక పట్టణానికే కాకుండా రాష్ర్ర్టానికే గర్వకారణంగా చెప్పొచ్చు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌తో పాటు త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొననుండడం ఆనందదాయకం. దుబ్బాక ఆధ్యాత్మిక కేంద్రంగా మారేందుకు ఈ ఆలయం ఎంతో దోహదపడతుంది.