
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో చింతమడక మధిర గ్రామాల్లో అందమైన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు విశాలమైన రోడ్లు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక మధిర గ్రామం అంకంపేటలో 43, శంకర్‌నగర్‌లో 21, ఎస్సీకాలనీలో 71 నూతన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అలాగే, 31ఇండ్లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామస్తుల్లో ఐక్యత ఉండడంతోనే ఇండ్లు తొందరగా పూర్తయ్యాయని, గ్రామానికి వస్తుంటే పచ్చని పొలాలు.. నిండిన చెరువులను చూస్తుంటే కడుపు నిండినంత ఆనందంగా ఉందన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి, అన్నదాతల ఉసురు పోసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఉన్న మార్కెట్లు ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని మొండికేస్తున్నదన్నారు.
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 12: కాళేశ్వరం నీళ్లతో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు, మత్తళ్లు దూకుతున్న చెక్‌డ్యాంలు, నిండుకుండల్లా చెరువులు, కుంటలు కనబడుతున్నాయని, ఇది తెలంగాణ సాధించిన విజయమని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చింతమడక మధిర గ్రామమైన అంకంపేటతో పాటు సీతారాంపల్లి మధిర గ్రామం శంకర్‌నగర్, సీతారాంపల్లి గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంకంపేటలో 43, శంకర్‌నగర్‌లో 21, ఎస్సీ కాలనీలో 71 డబుల్ ఇండ్లకు గృహ ప్రవేశం చేయించడంతో పాటు అదనంగా చింతమడక మధిర గ్రామం అంకంపేటలో 21, సీతారాంపల్లి మధిర గ్రామం శంకర్‌నగర్‌లో 10 డబుల్ ఇండ్లకు భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో చింతమడక మధిర గ్రామం అంకంపేట, సీతారాంపల్లి మధిర గ్రామమైన శంకర్‌నగర్, సీతారాంపల్లి ఎస్సీకాలనీలో అందమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు విశాలమైన రోడ్లు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తుల్లో ఐక్యత ఉండడంతోనే ఇండ్లు తొందరగా పూర్తయ్యాయన్నారు. ఈ గ్రామాలకు కాళేశ్వరం నీళ్లు రావడంతో చిన్న చినుకు పడ్డా చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయని, గ్రామానికి వస్తుంటే పచ్చని పొలాలతో నిండిన చెరువులతో ఆహ్లాదంగా, కడుపు నిండినంత సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ గ్రామాల్లో మిగిలిపోయిన పనులతో పాటు అవసరమున్న చోట ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు మంజూరు చేయిస్తామన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి 24 గంటల నీళ్లు వచ్చేలా ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. నీళ్లను వృథా చేయకుండా వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు వేప చెట్టు, ఇంటి వెనుక పండ్ల మొక్కలు పెంచాలని సూచించారు.
రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం..
కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి, అన్నదాతల ఉసురు పోసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఉన్న మార్కెట్లు ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని మొండికేస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ధర్నాలు చేస్తున్నారన్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్ రైతుబంధు సహాయం చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం డీజిల్ పేరుతో దోచుకుంటున్నదని మండిపడ్డారు. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో రైతుబీమా ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్, ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే, ఓ వైపు రాష్ట్ర బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచి, గ్యాస్ సబ్సిడీ తగ్గించి, గ్యాస్ రేట్లు పెంచి, మార్కెట్లు ఎత్తివేస్తున్నందుకా! మీ పాదయాత్రలు’.. అని మంత్రి ప్రశ్నించారు. 70 ఏండ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క చెక్‌డ్యాం అయినా కట్టి, ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అన్నారు. గతంలో 400 ఫీట్లు బోరు వేసినా, దుబ్బ తప్ప ఒక్క చుక్క నీరు రాలేదని, కానీ నేడు చెంబుతో నీళ్లు అందుకునే పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో నేడు సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందన్నారు. మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేసే వారికి ప్రజలపై ప్రేమ ఉంటే, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించేందుకు పాదయాత్రలు చేయాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతామంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ, నేడు కాళేశ్వరం నీళ్లతో తెలంగాణలో ఎక్కడా చూసినా పచ్చని పంట పొలాలు, మత్తళ్లు దూకుతున్న చెక్‌డ్యాంలు, నిండుకుండల్లా చెరువులు, కుంటలు కనబడుతున్నాయని, ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? అని అన్నారు. ఇది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కావడానికి కష్టపడి చేసిన అధికారులు, కాంట్రాక్టర్లను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఆర్డీవో అనంతరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు, సర్పంచులు హంసకేతన్‌రెడ్డి, మిట్టపల్లి ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.