
అందోల్, సెప్టెంబర్ 12 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్నదని పాదయాత్రో.. భోగయాత్రో ప్రజలకు అర్థం కావడంలేదని, పాదయాత్రకు రోజుకో జిల్లా నుంచి డబ్బులిచ్చి కూలీలను తీసుకువస్తున్నారని, యాత్రలో సకల భోగాలు అనుభవిస్తూ దానికి సంగ్రామయాత్ర అని పేరుపెట్టుకుని పిక్నిక్లా ఎంజాయ్ చేస్తున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. ఆదివారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. విస్తీర్ణంలో 20 కిలోమీటర్లు కూడా లేని అందోల్ మండలంలో నాలుగు రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర చేయడం చూస్తేనే ఆయన పాదయాత్ర ఎంత స్పీడో అర్థం చేసుకోవచ్చన్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అర్థం కానీ అయోమయంలో రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకుంటున్నారని, ఆయన యాత్రతో పార్టీకి ఒరిగిందేమి లేదని పార్టీ నేతలూ జుట్టు పీక్కుంటున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా జోగిపేట రోడ్డు ఇంత అధ్వానంగా ఉంటే, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై ఎమ్మెల్యే స్పందించారు. ‘ఈ రోడ్డు జాతీయ రహదారుల పరిధిలోనిది.. మీరు రోడ్లు బాగుచేయకుండా.. ఆ విషయాన్ని మరిచి, మమ్మల్ని విమర్శించడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం’.. అని ఎమ్మెల్యే మండిపడ్డారు. రోడ్లు కేంద్ర పరిధిలోవా? రాష్ట్ర పరిధిలోవా? తెలియకుండా ఓ ఎంపీ, మాజీ మంత్రి(బాబుమోహన్) యాత్రల పేరుతో డ్రామాలడడంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మరని.. అందోల్ ప్రజలైతే బీజేపీ నేతలపై పూర్తి విశ్వాసంకోల్పోయారని.. ఈ విషయం శనివారం చేపట్టిన యాత్రతో తేలిపోయిందన్నారు. యాత్రకు ప్రజలే కాదు.. పార్టీ నేతలూ హాజరుకాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడానికే పాదయాత్ర నిర్వహించారని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాదన్నారు. పరిపాలనలో తెలంగాణ భేష్ అంటూ ఇక్కడి పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నది నిజం కాదా? అన్ని సంస్థలను మూసేస్తూ వేల కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్నది కేంద్రం కాదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ అలాంపూర్ నుంచి గద్వాల్ వరకు 40కిలోమీటర్ల మేరా పాదయాత్ర చేపట్టారని, కేసీఆర్ పాదయాత్రకు, బండి సంజయ్ పాదయాత్రకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిదని, రానున్న రోజుల్లో ప్రజల్లో జోకర్‌గా బండి సంజయ్ మిగిలిపోతారన్నారు.
బాబూమోహన్‌కు బుద్ధి రాలేదు
కేసీఆర్ టికెట్ ఇచ్చి, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బాబూమోహన్‌కు బుద్ధి రాలేదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. పాదయాత్రలో బాబూమోహన్‌కు ఓట్లు వేసిన 2వేల మందిలో 50మంది కూడా రాలేదన్నారు. దీన్ని గుర్తెరిగి మాట్లాడాలని సూచించారు. ‘బాబుమోహన్ నువ్వు కామెడీ యాక్టర్ కావొచ్చు.. నాకు జర్నలిస్టుగా అనుభవముందని గుర్తుంచుకో.. బండి సంజయ్ యాత్ర భోగాయాత్ర, విలాసా యాత్ర’.. అని తెలంగాణ ప్రజానికం భావిస్తున్నదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాబూమోహన్‌కు 2వేల ఓట్లు వచ్చాయని, సినిమా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే 20 ఓట్లు కూడా రావన్నారు. బాబుమోహన్ పట్ల సినీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయాలు, సినీ పరిశ్రమలో ఎక్కడైనా సరే, తోటివారిని అవమానించడమే బాబుమోహన్‌కు తెలిసిన విద్యా అని, ఓ బీజేపీ కార్యకర్తను తోసేసి అది మరోసారి నిరూపించుకున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.