
చేర్యాల, సెప్టెంబర్ 11: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆలయ వర్గం సిద్ధమైంది. స్వామి వారి ద్వారాలకు వెండితో తొడుగులు చేయిస్తున్నది. స్వామి వారి ఆలయంలోని గర్భాలయంలో ద్వారంతో పాటు అర్ధమండపంలోని రెండు ద్వారాలు, తలుపులకు వెండితో తయారు చేసిన తొడుగులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న 11 క్వింటాళ్ల మిశ్రమ వెండిని రూ.16 లక్షలతో శుద్ధి చేయించి అందులో నుంచి వచ్చిన శుద్ధమైన వెండి 5 క్వింటాళ్ల 20 కిలలో తలుపులు, ద్వారాలకు వెండితో చేసిన డిజైన్లను అతికించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇతర ఆలయాల్లో లేని విధంగా ఎక్కువ వెండిని వెచ్చించి తొడుగులు చేయిస్తున్న ఆలయంగా కొమురవెల్లి రికార్డు సాధించనున్నది. కొన్ని ఆలయంలో వెండి తొడుగులు ఉన్నప్పటికీ ఐదున్నర క్వింటాళ్ల 20కిలోల వెండి ఉన్న ఆలయంగా కేవలం ఈ గుడి నిలువనున్నది.
తయారవుతున్న వెండి తొడుగులు..
స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ఆలయ ద్వారాలు, తలుపులకు వెండి తాపాడం వేయించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆలయవర్గాలకు సూచించారు. స్వామి వారికి భక్తులు సమర్పించిన మిశ్రమ వెండిని వెంటనే ప్రభుత్వ మింట్ కంపౌంట్లో ఆలయ అధికారులు శుద్ధి చేయించి, స్వచ్ఛమైన వెండి లభ్యమైన అనంతరం దానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి చెందిన తిరుపతి బాలాజీ మెటల్ సంస్థకు చెందిన స్తపతి వేణుగోపాల్ అనే వ్యక్తి ఆన్లైన్లో టెండరు దక్కించుకున్నారు. టెండరు దక్కించుకున్న వ్యక్తి ఆలయవర్గాలు ద్వారాలు, తలుపులకు కావాల్సిన వెండిని అప్పగించడంతో రెండు మాసాలుగా కొమురవెల్లిలోని గెస్ట్‌హౌస్‌లో వెండి తొడుగులు తయారు చేస్తున్నారు. కాగా, రూ.26 లక్షలను వెండి తొడుగులను తయారు చేస్తున్న గుత్తేదారుడికి ఆలయం నుంచి చెల్లించనున్నారు.
శైవ సంప్రదాయం మేరకు డిజైన్లు..
శైవ సంప్రదాయం మేరకు ద్వారాలు, తలుపులకు డిజైన్లు తయారు చేస్తున్నారు. శివాలయాల్లో ఉండాల్సిన విధంగా వెండి తొడుగులను టెండరుదారులు డిజైన్లు తయారు చేస్తున్నారు. ఆలయంలోని ద్వారాలకు, తలుపులకు కమలం, పద్మాలు, ఆకులతో కూడిన పువ్వులు తదితర డిజైన్లు తయారయ్యాయి. ద్వారాలు పెద్ద సైజులో ఉండడంతో అదేస్థాయిలో వెండితో తయారు చేసిన తొడుగులు తదితర వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు సాగుతున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతితో పాటు ఈవో ఏ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ కృషి చేస్తున్నారు.
త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు..
ద్వారాలు, తలుపులకు వెండి తొడుగులు చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వెండితో తయారు చేస్తున్న వస్తువులను వివిధ డిజైన్లలో స్తపతి బృందం తయారు చేస్తున్నది. అక్టోబర్ నెలాఖరు వరకు వెండి తొడుగుల ఏర్పాటు పనులు పూర్తి చేయించాలని ఆలయ అధికారులతో పాటు ధర్మకర్తల మండలి సైతం కృషి చేస్తున్నది. ఆలయంలోని ద్వారాలు, తలుపులకు వెండి తొడుగులు వేయించిన అనంతరం ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.