
చేర్యాల, అక్టోబర్ 10 : పూర్వపు వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న చేర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ సర్కారు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసింది. చేర్యాల, మద్దూరు మండలాలతో పాటు చేర్యాలలోని కొన్ని గ్రామాలను కలుపుతూ కొమురవెల్లి మండలంగా ఏర్పాటు చేసింది. కొన్ని నెలల క్రితం మద్దూరు మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ ధూళిమిట్ట మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చేర్యాల పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. కొమురవెల్లి మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు పాలన చేరువ చేసింది. ధూళిమిట్ట మండల కేంద్రంలో రెవెన్యూ, ట్రాన్స్‌కో కార్యాలయాలు ఏర్పా టు చేయడంతో పాటు మరిన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
సిద్దిపేట జిల్లా ఏర్పాటు తర్వాత చేర్యాల ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
దుబ్బాకలో జోరుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు
దుబ్బాక, అక్టోబర్ 10 : సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరింది. పరిపాలన సౌలభ్యం కోసం ఐదు మండలాలు ఏడు మండలాలుగా ఆవిర్భవించాయి. నూతనంగా ఏర్పాటైన రాయపోల్, నార్సింగ్ మండలాలు ఉన్నాయి. దౌల్తాబాద్ మండలంలోని రాయపోల్ గ్రామ పంచాయతీ మండల కేంద్రంగా ఏర్పాటైంది. చేగుంట మండలంలోని నార్సింగ్ గ్రామ పంచాయతీ మండల కేంద్రంగా ఏర్పడింది. చేగుంట, నార్సింగ్ మండలాల ప్రజలకు సిద్దిపేట జిల్లా కేంద్రం దూరం కావడంతో మెదక్ జిల్లా పరిధిలోకి చేర్చారు. సిద్దిపేట జిల్లాలోకి దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలున్నాయి. మల్లన్న సాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో శాశ్వత సాగునీటి పరిష్కారం లభించింది. నియోజకవర్గంలో తొగుట మండలం తుక్కాపూర్‌లో 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించారు. దుబ్బాకలో రూ.18.5 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మించారు.
రూ.11 కోట్లతో సీఎం కేసీఆర్ బడి…
దుబ్బాకలో రూ.11కోట్లతో సీఎం కేసీఆర్ బడి నిర్మించారు. త్వరలోనే ప్రారంభం కానున్నది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది.