
హుస్నాబాద్, ఆగస్టు 9 : వానకాలం వరిసాగు దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ ఏడు వరణుడు ముందే పలకరించి కనికరించడంతో రైతులు వరినాట్లను ముందుగానే వేసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 90శాతం వరినాట్లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. నారుమడి దున్నడం నుంచి నారు పెరుగుదల, పొలం దున్నడం, నాటు వేయడం ఒక ఎత్తైతే నాటు అనంతరం తీసుకునే జాగ్రత్తలు మరో ఎత్తుగా చెప్పొచ్చు. వరినాటు పచ్చగా మారి పొట్టదశకు వచ్చే సమయంలో అనేక చీడపీడలు వస్తుంటాయని, వీటి పై అప్రమత్తంగా ఉండి సకాలంలో తెగులుకు తగిన రసాయనాలను వాడినట్లయితే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చని అధికారులు సూచిస్తున్నారు. వరినాటు వేసినప్పటి నుంచి కోతదశకు వచ్చే దాకా వరిపంటకు సోకే తెగుళ్లు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి.
వరిపంటకు ఈ తెగులు నాటు వేసిన మొదట్లోనే ఆశించే అవకాశం ఉంటుంది. పొలంలోని నీటి మట్టానికి దగ్గరగా వరి పిలకల తొడిమెలపై మచ్చలు ఏర్పడుతాయి. ఇవి పాముపై ఉండే మచ్చల్లా కనిపిస్తాయి. ఈ తెగులు సోకినప్పుడు నారు పిలకలు ఎదగవు. ప్రతి చదరపు మీటరుకు పదిశాతం మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. దీని నివారణకు ఎక్సాకొనజోల్ 5 ఈసీ లేదా 5ఎస్సీ 2.మి.లీ.లు, లేదా వాలిడామైసిన్ ఎల్ 2మి.లీ.లు, లేదా ప్రాపికొనజోల్ 1మి.లీ.లు, లేదా కార్బండాజిమ్, ప్లూజిలాజోల్ 1.8మి.లీ.ల మందును ఒక లీటరు నీటికి కలిపి ప్రతి 15 రోజులకొకసారి పంటపై పిచికారీ చేయాలి.
నారుమడిలో వరినారు ఎదుగుతున్న సమయంలో ఆకు చివరల తడిసినట్టుగా ఉండి పసుపు రంగుకు మారి ఆకుల ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే పొలంలోని నీరును బయటకు పంపాలి. అగ్రిమైసిన్ 0.4గ్రాములు లేదా ప్లాంటోమైసిన్ 0.2గ్రాముల మందును 7రోజుల్లో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వరిపంటకు ప్రధానంగా సోకే తెగుళ్లలో ఇది ఒకటి. దీని వల్ల పంట మొక్కలకు నల్లని చారలతో కూడిన మచ్చలు ఏర్పడుతాయి. పిలకలు వాడిపోవడం, కింది వరుసలో ఉన్న ఆకుల పసుపు రంగులోకి మారి కుళ్లిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2మి.లీ.లు లేదా వాలిడామైసిన్ 2మి.లీ.లు లేదా కార్పండాజిమ్ 1గ్రా.మందును లీటరు నీటికి కలిపి 15రోజుల్లో రెండుస్తార్లు పంటపై చల్లాలి.
ఈ తెగులు వరి పొట్టదశలో ఆశించే అవకాశం ఉంది. పొట్టదశలో ఉన్న వరి ఆకు తొడిమెలపై నల్లటి లేదా చాక్లెట్ రంగు మచ్చలు ఏర్పడుతాయి. దీంతో పొట్టలో ఉన్న పూర్తిగా తయారు కాని వరిగింజలు ఎదగవు. ఈ తెగులు వల్ల మొలకల పొట్ట పూర్తిగా ఎండిపోవడం, గొలుసు వేసినప్పటికీ గింజలు తాలుగా మారడం జరుగుతుంది. ఆశించిన దిగుబడి రాదు. నాటు ఆలస్యంగా వేయడం గాని, పొట్టదశలో మబ్బులతో కూడిన వర్షం పడటం గాని, గాలిలో తేమ 90శాతం కంటే ఎక్కువగా ఉంటే ఈ తెగులు సోకుతుంది. కార్బాండాజిమ్ 1గ్రాము లేదా ప్రాపికొనజోల్ 1మి.లీ.లు లేదా టెబుకొనజోల్ 0.4గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పొట్టదశ, పూత దశలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వరి పంట ఈనే దశలో ఆకుల కొనలు ఎండిపోవడం, మొక్కల మొదళ్లు కుళ్లిపోయి పీకి చూస్తే దుర్వాసన రావడం ఈ తెగులు ప్రధాన లక్షణాలు. పలు కీటకాలతో ఈ తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. కాండం తొలిచే పురుగును ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు మురుగు నీటిని బయటకు తీసి కొత్త నీటిని పంటకు పెట్టడమే దీని నివారణ చర్యలుగా చెప్పొచ్చు.
వరిపంటకు సోకే వివిధ కీటకాలు,
వరిపంటకు ఉల్లికోడు రోగం నివారణకు కార్బోప్యూరాన్ గులికలు ఎకరాకు 10కిలోల చొప్పున పంటపై చల్లాలి. తాటాకు తెగులు నివారణకు క్వినాల్ఫాస్ 2.మి.లీ.లు లేదా క్లోరిఫైరిఫాస్ 1.6మి.లీ.లు, వరి ఈగ తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ఎకరాకు 8కిలోలచొప్పున వేయాలి. అలాగే తామర పురుగు నివారణకు మోనోక్రొటోఫాస్ 1.6మి.లీ.లు లేదా ఫిప్రోనిల్ 2.0మి.లీలు, ఆకునల్లి నివారణకు డైకోఫాల్ 5మి.లీ.లు, కంకినల్లి నివారణకు డైకోఫాల్ 5మి.లీ,లు లేదా స్పైరోమెసిపెన్ 1మి.లీ.లు, ఆకుచుట్టు పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 1.6మి.లీ.లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లు, రెల్లరాల్చు పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ మందు 1.6మి.లీ.లు, కంపునల్లి తెలుగు నివారణకు క్లోరోఫైరిఫాస్ 1.6మి.లీ.ల మందును లీటరు నీటికి కలిపి సాయంత్రం సమయంలో పంట చుట్టూ తిరుగుతూ పిచాకారీ చేయాలి. చీడపీడల నివారణకు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.
వరిపంట వేసినప్పటి నుంచి కోతదశకు వచ్చే వరకు రైతులు సస్యరక్షణ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. యాసంగిలో కంటే వానకాలంలో వరిపంటకు అనేక రకాలు పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. పంట రంగు మారడం గానీ, మొదళ్లు కుళ్లిపోవడం గానీ, పంటలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే దానిని గుర్తించి తగిన మందును వాడాలి. అందుబాటులో ఉండే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.