
దళిత వాడలు మెరవనున్నాయి. గిరిజన ఆవాసాలు కొత్తరూపును సంతరించుకోనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. దీనికోసం ఎస్సీలు, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటిట్యాంకులు, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, కొత్త విద్యుత్ లైన్లు తదితర పనులు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. పట్టణాల్లోనూ ఈ పనులు చేపడతారు. దీనికోసం క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. అధికార యంత్రాంగాలు పంపించే నివేదికల ఆధారంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టనున్నది. తద్వారా ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన సౌక్యరాలు అందుబాటులోకి రానున్నాయి.
సిద్దిపేట, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని దళితవాడలు, గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దళితవాడలు, గిరిజన తండాలు, ఇతర ఆవాసాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారుల బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. ప్రతి దళిత వాడ, గిరిజన తండాలో కనీస వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే జిల్లాల స్థాయిలో అధికారుల సమావేశాలు జరిగాయి. దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో చేపట్టాల్సిన పనులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్లు ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేశారు. చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల గుర్తింపు, పనులు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రభుత్వ విభాగాల ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రొఫార్మాను నింపుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సర్వే పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన పనులకు నిధులు కేటాయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని దళిత వాడల్లో, గిరిజన ఆవాసాల్లో ప్రగతిలో ఉన్న పనులు, అదనంగా చేపట్టాల్సిన పనులను గుర్తించే పనిలో జిల్లాల అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తండాలను ఏర్పాటు చేసింది. అనుబంధ(మధిర) గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులకు పాలన చేరువైంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయి. దీంతో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామాలు, తండాలతో పాటు పట్టణాల్లో సైతం సర్వే చేపట్టి చేపట్టాల్సిన పనులను గుర్తిస్తున్నారు. ఆయా మండలాల్లోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేకాధికారులు,సంబంధింత ఇంజినీరింగ్ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మా ఆధారంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, మిషన్ భగీరథ పనులు, పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టాల్సిన పనులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులను గ్రౌండింగ్ చేస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన పనులకు ఉపాధి హామీ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, డిస్కంల నిధులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను వినియోగించుకోనున్నారు. గ్రామాల్లో కొత్త వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, కొత్త లైన్లు, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాల తొలగింపు తదితర పనులను విద్యుత్ డిస్కంలు చేపడుతాయి.అంచనాలు రూపొందించాక నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల నిధులను వాడుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి అందనున్నాయి. త్వరలోనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యన్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేసింది. వ్యవసాయం అభివృద్ధి కోసం పంటలు వేసుకోవడానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడంతో పాటు బోర్ల తవ్వకాలకు, స్వయం ఉపాధి పథకం కింద, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి , పైలెట్ ప్రాజెక్టుల కింద గ్రామాలను ఎంపిక చేసి మినీ డెయిరీలను ఏర్పాటు చేసి పాడి గెదేలను అందించి తోడ్పాటును అందించింది. వివిధ పథకాలలో సబ్సిడి కింద లోన్లు మంజూరు చేసి అదుకుంది. దళితుల ఆర్థికాభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.