
కొత్త జోనల్ విధానం అమలుతో స్థానికులకే 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు దక్కనుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. ఈ మేరకు జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా వివిధ పోస్టులను ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోస్టుల పునర్వ్యవస్థీకరణ పూర్తికావడంతో నోటిఫికేషన్ల్ల విడుదలకు మార్గం సుగమమైంది. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో యువత సర్కారు కొలువులు సాధించేందుకు సిద్ధమవుతున్నది. కాగా, మెదక్, సిద్దిపేట జిల్లాలు రాజన్న జోన్లో ప్రభుత్వం చేర్చించింది. సంగారెడ్డి జిల్లా చార్మినార్ జోన్లో ఉంది. మల్టీజోన్-1లో సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఉండగా, మల్టీ జోన్-2లో సంగారెడ్డి జిల్లాను ప్రభుత్వం చేర్చింది. కొత్త జోనల్ విధానంతో ప్రస్తుత ఉద్యోగులకు సైతం లబ్ధి చేకూరనున్నది.సీఎం కేసీఆర్ దూరదృష్టితో, శాస్త్రీయ పద్ధతిలో కొత్త జోనల్ విధానం ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు
వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్య, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా వివిధ పోస్టులను ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. త్వరలోనే పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీల లెక్కలు తీసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏ ఏడాది ఎన్ని పోస్టులను గుర్తిస్తే, అదే ఏడాది పోస్టులను భర్తీచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇక నుంచి కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగాల భర్తీ చేయనున్నది. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ను ప్రభుత్వం తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న మూస విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా, స్థానికేతరుల రిజర్వేషన్ కోటాకు సైతం కళ్లెం వేసింది. ఎక్కడికక్కడే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెంచే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మల్టీజోన్-1కింద.. జోన్-3లో (రాజన్న సిరిసిల్ల) సిద్దిపేట, మెదక్ జిల్లాలు వస్తాయి. మల్టీజోన్-2 కింద.. జోన్-6లో(చార్మినార్) పరిధిలోకి కింద సంగారెడ్డి జిల్లా వస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యానికి సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయి. గతంలో రెండు జోన్లుగా ఉన్న రాష్ర్టాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా ప్రభుత్వం మార్చింది. దీంతో జిల్లాస్థాయి నుంచి మల్టీజోన్ వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 5 శాతం పోస్టులను ఓపెన్ కోటా ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా కింద పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త జోనల్ విధానం ద్వారా గతంలో ఉన్న వైశాల్యం తగ్గనుంది. దీంతో స్థానికంగానే ఉంటూ వారి జోన్ పరిధిలోనే ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. గతంతో పోల్చితే నూతన జోనల్ విధానం ద్వారా జిల్లాలో భారీగా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశమున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం లబ్ధిగా చేకూరనున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో, శాస్త్రీయ పద్ధతిలో కొత్త జోనల్ విధానం ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది వరకు ఉమ్మడి మెదక్ జిల్లా 6వ జోన్లో ఉండేది. 6వ జోన్ పరిధిలోకి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ జిల్లాలు ఉండేవి. ఆనాడు జోన్ వైశాల్య పరంగా ఎక్కువ పరిధిలో విస్తరించి ఉంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానం ద్వారా గతంలో ఉన్న జోనల్ వ్యవస్థ పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. కొత్త జోనల్ విధానంలో భాగంగా రాష్ట్రంలో 7జోన్లు, 2మల్టీజోన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో రాజన్న జోన్ పరిధిలోకి సిద్దిపేట, మెదక్ జిల్లాలు వస్తాయి. ఈ జోన్ పరిధిలో ఇంకా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జిల్లాలు ఉన్నాయి. కొత్త జోన్ విధానంలో జిల్లా వాసులకు ఉద్యోగావకాశాలు భారీగా పెరిగే అవకాశమున్నది. జోన్ పరిధిలోని మిగిలిన జిల్లాలతో పోటీపడడం జిల్లా నిరుద్యోగులకు పెద్దకష్టం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 6వ జోన్ పరిధిలోనే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ లాంటి జిల్లా వాసులతో పోటీపడిన జిల్లా నిరుద్యోగులకు, కొత్త జోనల్ విధానం ఉన్న జిల్లాలో పోటీపడడం మరింత సులభతరం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రకంగా చూసినా కొత్త జోనల్ విధానం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం శుభపరిణామంగా చెప్పవచ్చు.
కొత్త జోనల్ విధానంతో పాత వ్యవస్థ పూర్తిగా రద్దు కానున్నది. ఇన్నాళ్లు ఉన్న జోనల్ వ్యవస్థ ద్వారా జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కేడర్ వరకు స్థానికేతరులు భారీగా పోస్టులు తన్నుకొని పోయేవారు. కొత్త విధానం దీనికి కత్తెర వేసింది. ఇది వరకు ఉన్న విధానం ప్రకారం చూస్తే జిల్లా కేడర్లో 80:20 ఉండేది. అంటే వంద పోస్టులు పడితే అందులో 80 పోస్టులు స్థానికులకు, 20పోస్టులు స్థానికేతర రిజర్వేషన్ల్లుగా పరిగణించి భర్తీచేసే వారు. జోనల్ కేడర్లో 70:30 శాతం, మల్టీ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారనున్నది. జిల్లా, జోనల్, మల్టీ జోన్ (గతంలో మల్టిజోన్)తో పాటుగా రాష్ట్రస్థాయి కేడర్ల వ్యవస్థ పూర్తిగా మారింది. జిల్లా, జోనల్, మల్టీజోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఇక ముందు 95శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోల్చిచూస్తే జిల్లాస్థాయి పోస్టుల్లో అదనంగా 15శాతం పోస్టులు స్థానికులకు దక్కతాయి. జోనల్ కేడర్లో 25శాతం, మల్టీజోన్ పరిధిలో 35శాతం పోస్టులు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, మల్టీజోన్ పరిధిలో కేవలం 5శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి. ఇందులోనూ మన స్థానికులు పోటీపడవచ్చు. లోతుగా చూస్తే కొత్త జోనల్ విధానం ద్వారా స్థానికేతర కోటాకు భారీగా కత్త్తెర పడి, స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ విధానంతో జిల్లా నిరుద్యోగులు కొత్తగా చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో భారీగా లబ్ధి పొందనున్నారు.
టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, రెనో ఆపరేటర్, జమేదార్, చైన్మెన్, డఫేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, ఫోర్మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, మిలిమాలన్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులు.
నాయిబ్ తాసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సీనియర్ స్టెనోగ్రాఫర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1,2,3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, తదితర పోస్టులు.
డిప్యూటీ కలెక్టర్/ ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్త్ ఇన్స్ట్రక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2,3 తదితర అధికారులు.