
పూలతో పూజించే దేవత అమ్మ.. పూలనే దేవతగా పూజిస్తే బతుకమ్మ..బతుకమ్మ బతుకును కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరీదేవీలను ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యంగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్తబట్టలు, నగలు ధరిస్తూ ఆడబిడ్డలను పండుగకు ఆహ్వానిస్తూ జరుపుకొనే గొప్ప వేడుక బతుకమ్మ. మనకే ప్రత్యేకం ఈ పండుగ. పూల జాతరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ముస్తాబయ్యాయి. పెత్తరమాస రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు బతుకమ్మను పేర్చి ఆడుతారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నీటి వనరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలు, బారికేడ్లు, తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది చెరువుల నిండా నీళ్లు ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పూల జాతరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ముస్తాబయ్యాయి. పెత్తరమాస రోజు నుంచి నుంచి తొమ్మిది రోజుల వరకు పూల బతుకమ్మను పేర్చి ఆడుతారు. కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ పండుగను చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చెరువు గట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. బతుకమ్మ పండుగ నిర్వహణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ పండుగకు ఏటా ప్రభుత్వం బతుకమ్మ చీరెను అందజేస్తుండగా, ఈసారి ఈనెల 2 నుంచి పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేటలో మంతిత్రి తన్నీరు హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,84,457 మంది మహిళలకు చీరెలను అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 3,80,127, మెదక్ జిల్లాలో 2,82,330, సంగారెడ్డి జిల్లాలో 4,22,000 చీరెలు పంపిణీ చేస్తున్నారు.
పెత్తరమాసతో ప్రారంభం…
పెత్తరమాస రోజున ప్రారంభమవుతున్న బతుకమ్మను వెడల్పు గల పల్లెంలో గుమ్మడాకులు పరిచి, వాటి మీద తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతిపూలు ఇలా తీరొక్కపూలతో పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఇది ఆడపడుచుల పండుగ, సాయంత్రం పట్టు చీరెలు, మెడలో నగలతో ముస్తాబై పూలతో పేర్చిన బతుకమ్మను ప్రధాన కూడళ్లలో విశాలమైన ప్రదేశంలో పెట్టి సద్దుల బతుకమ్మ వరకు బతుకమ్మ ఆడుతూ పాడుతుంటారు.
మహిళల ఆట.. పాట…
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్కజాము గడిచే చందమామ
ఒక్క జాముకైతే చందమామ
శివుడెట్ల బయిలెల్లె చందమామ
శివుడికీ సరిమల్లె చందమామ
శివుని వాకిట్లోన చందమామ
బంగారి పువ్వులే చందమామ.. అంటూ ఒక్కొక్క పువ్వేసి శివుడిని ప్రార్థించి బతుకమ్మలను పెడుతారు. నూతన వస్ర్తాలను ధరించి బతుకమ్మ చుట్టూ మహిళల చప్పట్లతో పాటలు పాడుతూ ఒంగుతూ లేస్తూ లయబద్ధంగా కుడి నుంచి ఎడమ వైపునకు ఆడుగులేస్తూ ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. ఈ పాటలు గ్రామీణ ఆచార వ్యవహారాలు దైనందిన జీవిత బాధలు, కష్టాలు, కన్నీళ్లు ప్రతిబింబింపజేస్తాయి. చీకటి పడే వరకు బతుకమ్మలను ఆడిన తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు.
సాగనంపుతూ…
తంగేడు పూల సందమామ.. మల్లెన్నడు వస్తావు.. సందమామ.. గునుగు పూల సందమామ.. బతుకమ్మ పోతుంది సందమామ.. అంటూ బతుకమ్మను సాగనంపుతూ మహిళలు పాటలు పాడుతారు. బతుకమ్మలపై పిండితో చేసిన ప్రమిదల్లో నూనె పోసి జ్యోతులు వెలిగిస్తారు. పైభాగాన ఉన్న పసుపు, గౌరమ్మను తీసి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. గౌరమ్మగా చేసిన పసుపు ముద్దను వాయినంగా మహిళలు స్వీకరిస్తారు.
లక్ష్మీ, గౌరీదేవీలను పూజిస్తూ…
పూలతో పూజించే దేవత అమ్మ.. పూలనే దేవతగా పూజిస్తే బతుకమ్మ.. బతుకమ్మ బతుకును కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరీదేవీలను ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యంగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్తబట్టలు, నగలు ధరిస్తూ ఆడబిడ్డలను పండుగకు ఆహ్వానిస్తూ జరుపుకొనే గొప్ప వేడుక బతుకమ్మ. మన రాష్ట్రంలో జరుపుకొనే పలు పండుగల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వ్యవసాయాధారమైన తెలంగాణ ప్రజలు ఎన్ని కరువు కాటకాలను, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా తమ ఊపిరిలో ఊపిరిగా, తమ జీవన స్థితిగతులను, కష్టసుఖాలను కలబోసి జరుపుకొనే పండుగ బతుకమ్మ. బతుకమ్మను బతుకునిచ్చే తల్లిగా తెలంగాణ మహిళలు కొలిస్తే, బొడ్డెమ్మను కన్నెపిల్లలు, బాలికలు పూజిస్తారు.
బతుకమ్మ పేర్చడం..
బతుకమ్మ పండుగ అయిపొయేదాక తెలంగాణ పల్లెలో చిన్నాపెద్దల వరకు అందరిలో సంబురం అంబరాన్నంటుతుంది. తెల్లారక ముందే పరుగునా అడవికెళ్లి తంగేడు పువ్వు, గునుగు, గడ్డి, చామంతి తదితర పూలను తీసుకువస్తారు. ఉదయం పేర్చిన బతుకమ్మను పూజలు చేసి సాయంత్రం వేళలో మహిళంతా నూతన వస్ర్తాలను ధరించి గ్రామ చావిడీలు, గల్లీల వద్ద గుమిగూడి బతుకమ్మలను పెట్టి ఆడుతారు. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటిరోజు నుంచి తొమ్మిది రోజుల వరకు వివిధ రకాల ప్రమిదలు తయారు చేస్తారు. ఆరో రోజు మాత్రం బతుకమ్మను పేర్చరు, ఆడరు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మకు రంగురంగుల పూలతో పోటీపడి పెద్దవిగా పేరుస్తారు. ఆ రోజు గ్రామాల్లో మధ్యాహ్నం నుంచే చావిడీల వద్ద పెట్టి పట్టువస్ర్తాలు ధరించి మహిళలు బతుకమ్మ ఆడుతారు. సద్దుల బతుకమ్మ రోజు పసుపు ముద్ద (గౌరమ్మ)ను స్త్రీల సౌభాగ్యానికి నిదర్శనంగా చెబుతుంటారు. శక్తికి ప్రతిరూపంగా ఈ బతుకమ్మను పూజిస్తారు.
తొమ్మిది రూపాల్లో బతుకమ్మ
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో కొలుచుకోవడం తెలంగాణ ప్రజల ఆనవాయితీ.
బతుకమ్మ నవరాత్రుల్లో మొదటిరోజున ఎంగిలి పువ్వు అంటారు. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూలు ఒకరోజు ముందే తెంపుకొచ్చి అవి వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు. మొదటి రోజును ఎంగిలిపూలు అంటారు.
2.అటుకుల బతుకమ్మ
రెండో రోజు ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డిపూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులతో గౌరమ్మను పేర్చి ఆడవారందరూ కలిసి ఆడుకొని సాయంత్రం చెరువులో వేస్తారు. అటుకులు వాయినంగా పెడుతారు.
3.ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజు బతుకమ్మను మూడంతరాల్లో చామంతి, మంధారం తదితర పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. వాయినంగా సత్తు పిండి, పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెడుతారు.
4.నాన బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నాన బియ్యంగా ఫలహారం పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగు అంతరాల బతుకమ్మను పేర్చుతారు. నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ, చక్కెరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడుతారు.
5.అట్ల బతుకమ్మ
ఐదో రోజు తంగేడు, గునుగు, చామంతి తదితర పూలతో ఐదంతరాలుగా బతుకమ్మను పేర్చుతారు. వాయినంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.
6.అలిగిన బతుకమ్మ
ఆరో రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను పేర్వరు. పూర్వకాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరోరోజు బతుకమ్మను ఆడరు.
7.వేపకాయల బతుకమ్మ
వివిధ పూలతో ఏడో రోజు బతుకమ్మను ఏడంతరాలుగా పేర్చుతారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడుతారు లేదా పప్పుబెల్లం నైవేద్యంగా పెడుతారు.
8.వెన్నెముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు వివిధ రకాల పూలతో ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడుతారు. ఈ రోజు వాయినంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.
9.సద్దుల బతుకమ్మ
పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఎన్నిరకాల పూలు దొరికితే అన్ని రకాలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. చిన్న బతుకమ్మ పేర్చి గౌరమ్మను పెడుతారు. సద్దులు తీసుకెళ్లి చెరువు గట్టు వద్ద బతుకమ్మ ఆడిన అనంతరం వాయినాలు ఇచ్చుకొని సద్దులను కుటుంబీకులతో కలిసి భుజిస్తారు.
బతుకమ్మ పువ్వుల్లో ఔషధ గుణాలు…
బతుకమ్మను పూర్తిగా పూలతోనే పేరుస్తారు. ఒక్కొక్క పువ్వుల్లో ఒక్కొక్క దివ్య ఔషధ గుణం ఒదిగి ఉంది. ప్రధానంగా తంగేడు, గునుగు, చామంతి, కట్ల, గుమ్మడి, గడ్డి, గులాబీ, బంతి పువ్వు ఇలా రకరకాల పూలు బతుకమ్మలో పేరుస్తారు. బతుకమ్మను పేర్చే ముందుగా మొదటి రోజు, సద్దుల బతుకమ్మ రోజు గుమ్మడి పువ్వులోని అండశయాన్ని గౌరీదేవిగా పూజిస్తారు. ఈ పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. బతుకమ్మను పేర్చే ముందు గుమ్మడి ఆకులను తీసుకుంటారు. ఈ గుమ్మడి ఆకుల్లో శరీరంలోని వేడిని తగ్గించే దివ్య ఔషధం కలిగి ఉంది. తంగేడు పువ్వులో శరీరంలోని వేడిమి, వాతం, రక్తప్రసరణతో పాటు మరికొన్ని వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. గునుగు పువ్వులకు వివిధ రంగులను అద్ది ఎక్కువ సంఖ్య వరుసలో పేరుస్తుంటారు. ఇందులో జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన దివ్య ఔషధం ఉన్నది. పట్టుగుచ్చుల పువ్వుల్లో జలుబు, అస్తమా, కట్ల పువ్వు ఆయుర్వేద మందులకు, బంతిపూలు, సూక్ష్మక్రిములను నాశనం చేసి వ్యాధులు రాకుండా నివారించడానికి ఇలా ఒక్కో పువ్వులో ఒక్కో దివ్య ఔషధం ఉంది.
వాయినాలు ఇచ్చుకుంటూ…
ఉసికెలో పుట్టె గౌరమ్మ.. ఉసికెలో పెరిగే గౌరమ్మ.. కుంకుమలో పుట్టె గౌరమ్మ.. కుంకుమలో పెరిగే గౌరమ్మ.. పుసుపులో పుట్టె గౌరమ్మా.. పసుపులో పెరిగే గౌరమ్మ.. అంటూ మహిళలు చెరువు గట్టు వద్ద వాయినాలు ఇచ్చుకున్న అనంతరం తమతో తెచ్చుకున్న ఫలహారాలను, సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ఆరగిస్తారు. చెరువు గట్టు వద్ద నుంచి మహిళలు పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. తొమ్మిది రోజుల పాటు సంబురంతో జరుపుకున్న బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూరికి వచ్చి గ్రామానికి పండుగ శోభను కలిగిస్తారు.