
జిల్లావ్యాప్తంగా జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోనున్నాయి. గురువారం అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, నాయకులు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయనున్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమైంది. నేడు జెండా పండుగను జరుపుకోవడంతో పాటు ఈనెల 12వ తేదీలోగా గ్రామ, వార్డు కమిటీలు, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో టీఆర్ఎస్లో జోష్ నెలకొంది.
హుస్నాబాద్, సెప్టెంబర్ 1: ఉద్యమ పార్టీ, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీగా ప్రజల గుండెల్లో నిలిచిన టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్స్‌లో జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, హుస్నాబాద్ అభివృద్ధిపైన ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు వివరించడంలో ముందుండాలన్నారు. తెలంగాణ వచ్చాకనే హుస్నాబాద్ అభివృద్ధి సాధించిందన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ప్రేలాపనలు చేస్తున్నారని, దమ్ముంటే వారి హయాంలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో గుంట భూమికూడా లేని కొందరు నాయకులు తనను స్థానికేతరుడని అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంబులెన్స్ కొనుగోలు చేస్తామని వసూలు చేసిన డబ్బుల మాటేమిటని ప్రశ్నించారు. కోర్టు అడ్డంకులు తొలగిపోతే నెలల వ్యవధిలోనే గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితులు నష్టపోవద్దనేదే తన అభిమతమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమైందని, సీఎం కేసీఆర్ చొరవతో భవిష్యత్తులో హుస్నాబాద్‌లో ఊహించని అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మానస, లక్ష్మీ, కీర్తి, అనిత, వినీత, జడ్పీటీసీలు భూక్య మంగ, గీకురు రవీందర్, వంగ రవి, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్, టీఆర్ఎస్ అన్ని మండలాల అధ్యక్షులు, ఏడు మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, సెప్టెంబర్ 1: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలోనే చేర్యాల పట్టణం, మండలంతో పాటు కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని అన్ని గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేసి పండుగ నిర్వహించాలన్నారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీ వరకు కమిటీల నియామకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.