స్వల్ప పెట్టుబడి.. తక్కువ సమయలో ఎక్కువ ఆదాయం.. ఇంట్లోనే పెద్దగా ఖర్చు లేకుండా పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నారు.. దేవరకొండ పట్టణానికి చెందిన నామిని ఓంకార్, స్వాతి దంపతులు. ఆర్డర్లపై ఇతర
రాష్ర్టాలకు సరఫరా చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. తమతో పాటు ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తూ పలు సంస్థల ద్వారా అవార్డులు కూడా పొందారు.
పుట్టగొడుగుల పెంపకం కోసం ముందుగా నాణ్యమైన వరి గడ్డిని కొనుగోలు చేసి తెప్పించుకుంటారు. ఇంచు సైజులో కట్ చేసుకుని 90 డిగ్రీల టెంపరేచర్లో నీటిలో ఉడుకబెడుతారు. గడ్డిని తిరిగి 35 డిగ్రీల టెంపరేచర్లో ఆరబెట్టి పాలిథిన్ కవర్లలో 8 లేయర్లుగా నింపుతారు. అందులో ఒక వరుస గడ్డి ముక్కలు, మరో వరుస పుట్టగొడుగుల విత్తనాలు కలిపి కవర్‌కు రంధ్రాలు పెడుతారు. 21రోజుల పాటు చీకటి గదుల్లో ఉంచి ఆ తర్వాత కవర్‌ను రెండు భాగాలుగా కట్ చేస్తారు. పై భాగంలో ఇంచు మందం నల్లని మట్టి పోసి రోజూ నీళ్లు పెడుతారు. 15 రోజుల్లో పుట్టుగొడుగు మొలక బయటకు వస్తుంది. ఒక బెడ్ నుంచి 1 కేజీ పుట్టగొడుగు దిగుబడి వస్తుంది.
బెంగళూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ వ్యవసాయ క్షేత్రం (ఐఐఎఆర్) నుంచి పుట్టగొడుగు విత్తనాలు కొనుగోలు చేస్తారు. కిలో విత్తనాలు రూ.80 నుంచి రూ.100 ధర ఉంటుంది. విత్తనాల్లో నాణ్యత, సరైన యాజమాన్య పద్ధతులు తీసుకుంటేనే అధిక దిగుబడి, ఆశించిన ఫలితాలు ఉంటాయని ఓంకార్ తెలిపారు.
ఏడేండ్లుగా పుట్టగొడుగుల పెంపకంలో రాణిస్తూ 200మందికి పైగా శిక్షణ ఇచ్చిన ఓంకార్- స్వాతి దంపతులు పుడమి పుత్ర అవార్డు అందుకున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థలు ఫిబ్రవరి 27న వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సుస్థిర వ్యవసాయ రైతు సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పుడమి పుత్ర అవార్డును అందజేశారు.
పుట్టగొడుగుల పంట 35 రోజులకు దిగుబడి మొదలవుతుంది. 60 రోజుల వరకు దిగుబడి వస్తుంది. ఎప్పటికప్పుడు పంటను కోసి ప్యాకింగ్ చేసుకుని మార్కెట్‌కు తరలిస్తామని, కిలో పుట్టగొడుగుల ధర మార్కెట్లో రూ.300 పలుకుతుందని ఓంకార్ వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు.
పుట్ట గొడుగుల పెంపకంలో ఇప్పటికే 200మందికి పైగా శిక్షణ ఇచ్చామని ఓంకార్- స్వాతి దంపతులు తెలిపారు. ఇంటి ఆవరణలోనే పుట్టగొడుగుల పెంపకాన్ని స్వయం ఉపాధిగా చేపట్టి మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు
పుట్టగొడుగులు మంచి పౌష్టికాహారం. పుట్టగొడుగుల పెంపకాన్ని స్వయం ఉపాధిగా ఇంట్లోనే చేపట్టవచ్చు. మహిళలకు ఇదొక చక్కని ఉపాధి, వ్యాపార అవకాశం. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా సంపాదించుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉంటాం. సందేహాలు ఉంటే 9505622897 ఫోన్లో సంప్రదించవచ్చు.
– నామిని ఓంకార్, స్వాతి