సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 22 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయనున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నుంచి శనివారం దళితబంధు పథకం అమలుపై కలెక్టర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో మొదటి దశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు సమావేశాలు నిర్వహించి ఫిబ్రవరి 5వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. మార్చి 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఇందులో నుంచి రూ.10 వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. మార్చి 7వ తేదీలోగా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను కలెక్టర్ గ్రౌండింగ్ చేయాలన్నారు. దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్లు విడుదల అయ్యాయని ఆయన వెల్లడించారు. మరో రెండు, మూడు రోజుల్లో రూ.1200 కోట్లు విడుదల చేసి కలెక్టర్ ఖాతాలో జమ చేస్తామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకాధికారులను నియమించాలని సీఎస్ కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం సీఎస్ దళితబంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం, యూనిట్లు గ్రౌండింగ్ చేయడంపై కలెక్టర్‌తో సమీక్షించారు.
సంగారెడ్డి జిల్లాలో 69,243 ఎస్సీ కుటుంబాలు
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 69,243 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని మంత్రి, సీఎస్‌లకు వివరించారు. 2,76,971 మంది ఎస్సీ జనాభా ఉన్నదన్నారు. నియోజకవర్గం వారీగా 100 మంది లబ్ధిదారులను గుర్తించి షెడ్యూల్ మేరకు పూర్తి చేస్తామని వివరించారు.
మెదక్ జిల్లాలో 39,846 దళిత కుటుంబాలు
మేడ్చల్ జిల్లా నుంచి పాల్గొన్న మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 39,846 దళిత కుటుంబాలు ఉన్నాయన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలోని నాలుగు నియోజకవర్గాలలో కొంత భాగం మెదక్ జిల్లా మండలాలున్నాయన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసి సర్వే నిర్వహించి ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.