
రైతులు లాభదాయక పంటలు సాగుచేయాలి
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీ
గుమ్మడిదలలో పత్తి, కూరగాయ పంటల పరిశీలన
కేంద్ర వ్యవసాయ, మంత్రిత్వశాఖ
అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీ
గుమ్మడిదల, సెప్టెంబర్ 3 : రైతులు సేంద్రియ పంటలు సాగుచేసి లాభాలు పొందాలని కేంద్ర వ్యవసాయ, మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్లిఖీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రైతులు సాగుచేస్తున్న పత్తి, కూరగాయ పంటలను కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, జైనిక్ భవన్, జీడిమెట్ల, హైదరాబాద్ సంస్థ వారితో కలిసి పొలంబడి ద్వారా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు క్షేత్ర పాఠశాల (పొలంబడి) (ఎఫ్ఎఫ్ఎస్) కింద పత్తి పండించే వారికి 14 వారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు సీఐపీఎంసీ అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, జాతీయ సహకార అభివృద్ధి మంత్రిత్వశాఖ వంటి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన కూరగాయలను నేరుగా బోయిన్పల్లి మార్కెట్‌కు తరలించి విక్రయించడం, దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం చూసి ఆయన రైతులను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీత, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, ఎంటోమాలజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిద్ధికీ, ఏపీపీవోలు డాక్టర్ నీలారాణి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శ్వేతాసర్పుర్, నియోజకవర్గ హార్టికల్చర్ అధికారి శైలజ, మండల వ్యవసాయాధికారి జావీద్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, రైతులు బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
రామచంద్రాపురం, సెప్టెంబర్ 3 : ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ప్రముఖులను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట వైస్ చైర్మన్ రాములుగౌడ్, నాయకులు సోమిరెడ్డి, నర్సింహులు, యాదయ్య, విఠల్‌రెడ్డి ఉన్నారు.