సంగారెడ్డి, సెప్టెంబర్ 29: సీఎం కేసీఆర్ ఆడపడుచులను గౌరవిస్తూ మహిళలకు బతుకమ్మ చీరెలు అందజేస్తున్నదని, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన జడ్పీ సీఈవో ఎల్లయ్య సమావేశాలు ప్రారంభించారు. ఉదయం గ్రామీణాభివృద్ధి 2వ స్థాయీ సంఘం, విద్య, వైద్యం 4వ స్థాయీ సంఘం, మధ్యాహ్నం ప్రణాళికలు, సాయంత్రం వివిధ పనులు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యులు అడిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలు, పనులపై అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశాలకు తొలిసారి హాజరైన అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను సన్మానించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని, అధికారులు ప్రజలకు సోలార్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. మండలం వారీగా ప్రతి పంచాయతీలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సోలార్ ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ఈ నెల 1 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయని, పాఠశాలల సమయానికి బస్సులు నడపాలని కోరారు. ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునేలా చైతన్యం కలిగించాలన్నారు.
ఆంగ్ల బోధన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి..