
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎనిమిది కొత్త చెరువులు
నారాయణఖేడ్, నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో నిర్మాణానికి చర్యలు
రూ.56.47 కోట్ల నిధులు మంజూరు
భూసేకరణ కోసం మరో రూ.19 కోట్లు
అదనంగా 1,810 ఎకరాలకు సాగునీరు
సాగునీటి కల్పనలో ఖేడ్ నియోజకవర్గంలో మరో ముందడుగు
దశాబ్దాల రైతుల ఆకాంక్షలకు కార్యరూపం
ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే కృషితో నిర్మాణం
తెలంగాణ సర్కారు సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దశాబ్దాలుగా సాగునీరు లేక నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు సతమతమవుతుండగా, కొత్తగా మూడు చెరువులు నిర్మించేందుకు సిద్ధమైంది. నారాయణఖేడ్, నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో మొత్తం ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి రూ.56.47 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చెరువులతో అదనంగా 1,810 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అలాగే, చెరువుల భూసేకరణకు మరో రూ.19 కోట్లు మంజూరు చేసింది. గతంలో నాలుగు చెరువులు మంజూరు ఇచ్చిన సర్కారు, తాజాగా మరో నాలుగు చెరువులకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కృషి.. సీఎం కేసీఆర్ చొరవ.. మంత్రి హరీశ్‌రావు సహకారం ఫలితంగా రైతుల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరనున్నది. సాగునీటికి నోచుకోని చెలకల దరికి చెరువులొస్తున్నాయనే ఆనందం రైతుల కండ్లల్లో కనిపిస్తున్నది.
నారాయణఖేడ్, ఆగస్టు 29 : దశాబ్దాలుగా సాగునీటి వనరుల లేమి, భూగర్భ జలాల కొరతతో సతమతమవుతున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పలు విధాలుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో ముందడుగు పడింది. నారాయణఖేడ్, నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో మొత్తం ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి రూ.56.47కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువుల నిర్మాణం పూర్తయిన పక్షంలో అదనంగా 1,810 ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెరువుల నిర్మాణ ప్రక్రియలో భాగంగా భూసేకరణకు అవసరమైన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు సమర్పించగా, మరో రూ.19కోట్లు మంజూరయ్యాయి. గతంలో నాలుగు చెరువులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా మరో నాలుగు చెరువులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. కొత్త చెరువుల నిర్మాణం విషయంలో స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కృషికి తోడు సీఎం కేసీఆర్ చొరువ, మంత్రి హరీశ్‌రావు సహకారం ఫలితంగా రైతుల దశాబ్దాల ఆకాంక్షలు సాకారం కానున్నాయి. సాగునీటికి నోచుకుని చెలకల దరికి చెరువులొస్తున్నాయనే ఆనందం రైతుల కండ్లల్లో కనిపిస్తున్నది.
చెరువుల వారీగా మంజూరైన నిధులు
మంజూరైన ఎనిమిది చెరువులకుగానూ నాగల్గిద్ద మండలంలో ఆరు చెరువులు నిర్మించనుండగా, కేశ్వార్ చెరువుకు రూ.6.27 కోట్లు, ఏస్గీ చెరువుకు రూ.4.19 కోట్లు, ఉట్పల్లి చెరువుకు రూ.6.49 కోట్లు, ఇరక్‌పల్లి-1 చెరువుకు రూ.9.99 కోట్లు, ఇరక్‌పల్లి 2 చెరువుకు రూ.6.74 కోట్లు, మోర్గి చెరువుకు రూ.6.17కోట్లు, కంగ్టి మండలం సుక్కల్తీర్థ్ చెరువుకు రూ.14.47కోట్లు, నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ శివారులో నిర్మించనున్న చెరువు కోసం రూ.2.14 కోట్లు మంజూరయ్యాయి. ఆయా చెరువుల నిర్మాణానికి మొత్తం 385.05 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమైన రూ.19 కోట్ల నిధులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించగా, నిధులు విడుదలైన వెంటనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారిక సమాచారం. సాగునీటి వనరుల కోసం ఈ ప్రాంతం ఎన్నో ఏండ్లుగా పరితపిస్తుండగా, ఇక్కడి రైతుల బాధలను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టడం శుభపరిణామం.
వలసలను నివారించేందుకే..
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో సాగునీటి వనరులు లేక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉంది. ఆయా మండలాల్లో సాగు నీటి కల్పన విషయంలో సమైక్య రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అవకాశమున్న చోట చెరువుల నిర్మాణం చేపట్టాలని భావించి ప్రతిపాదనలు సమర్పించా. సీఎం కేసీఆర్ చొరువ, మం త్రి హరీశ్‌రావు సహకారంతో ఎనిమిది చెరువులకు అనుమతులు లభించి మొత్తం రూ.75 కోట్లు మం జూరయ్యా యి. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులను సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నా. చెరువుల మంజూరు విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
మహారెడ్డి భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
నాగల్గిద్ద మండలానికి పెద్దపీట
సాగునీటి విషయంలో నాగల్గిద్ద మండలానిది విచిత్ర పరిస్థితి. నాగల్గిద్ద కేంద్రంగా మండలం ఏర్పా టు కాక ముందు 33 పంచాయతీలు కలిగిన ఉమ్మడి మనూరు మండలంలో చెప్పుకోదగిన చెరువులు కేవలం రెండు మాత్రమే ఉండగా, మనూరు మండలం నుంచి కొత్త మండలంగా ఏర్పాటైన నాగల్గిద్ద మండలంలో ఒక్క చెరువు సైతం లేకపోగా, బహుషా జిల్లాలో చెరువుల్లేని ఏకైక మండలంగా నాగల్గిద్ద మిగిలిపోయింది. మరో విషయమేమిటంటే మంజీరా నది తమ రాష్ట్రంలోకి ప్రవేశించేది నాగల్గిద్ద మండలం నుంచి అయినా గత సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు విధించిన నిబంధనల పుణ్యమా అని ఇక్కడి రైతులు మంజీరమ్మను సాగనంపడమే తప్ప తమ పొలాలకు మళ్లించుకునే హక్కుకు నోచుకోలేదు. స్థానిక రైతుల అభ్యర్థన మేరకు ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి చూపిన చొరువతో కేసీఆర్ ప్రభుత్వం నాగల్గిద్ద, మనూరు మండలాల రైతుల సాగునీటి వినియోగానికి ఒక టీఎంసీ జలాలను కేటాయిస్తూ ఉత్తర్వులివ్వడం విశేషం. ఇక్కడి భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా భూగర్భ జలాల కొరత ఉన్నప్పటికీ కాలానుగుణంగా ఆ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే ఊరట పొందుతున్నారు ఇక్కడి రైతులు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చెరువుల మంజూరులో నాగల్గిద్ద మండలానికి పెద్దపీట వేస్తూ ఆరు చెరువులకు పరిపాలన అనుమతులిచ్చిందని చెప్పాలి.