
సంగారెడ్డి, ఆగస్టు 25 : ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నది. ప్రకృతి వనం అనగానే మొక్కలు నాటి సంరక్షణ చేయడమే అనుకుంటారు. కానీ ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటుతారని ఎవ్వరికీ అనిపించదూ.. గ్రామ పంచాయతీ పాలకవర్గం బృందం, మండల అధికారులు కొత్త ఆలోచనలు చేసి ప్రకృతి వనానికే సరికొత్తగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో ప్రకృతి వనం ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ఎకరా ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి పంచాయతీ పాలక వర్గానికి అప్పగించారు. అలా రూపుదిద్దుకున్న ప్రకృతి వనంలో ఔషధ, పండ్లు, ఫలాలనిచ్చే 116 రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఏకంగా 4 వేల మొక్కలను నాటి ప్రకృతి వనానికే కొత్తరూపు సంతిరించుకునేలా ఉపాధి హామీ పథకంలో దినసరి కూలీలకు పని కల్పించి ప్రకృతి వనంలో మొక్కలు నాటించారు. అంతేకాకుండా ఒకే పంచాయతీ పరిధిలో రెండు ఆవాస గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి రక్షించడం మరో విశేషం. ఔషధ మొక్కలు, పండ్లు, ఫలాల మొక్కల వివరాలను తెలిసే విధంగా బోర్డును ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రానికి కూత దూరంలో ఉన్న కులబ్గూర్ గ్రామ పంచాయతీలో మహ్మద్ షాపూర్ తండా, 161 జాతీయ రహదారి పక్కన సదాశివనగర్ కాలనీలు ఉన్నాయి. పంచాయతీ పరిధిలో ఎకరా భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి నాటిన మొక్కలను ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఇద్దరు కూలీలు కృష్ణ, అరుణ భార్యాభర్తలు. కంటికి రెప్పలా మొక్కలను సంరక్షణ చేస్తున్నారు. ఏడాది క్రితం ప్రభుత్వం ఉత్తర్వులతో ప్రతి పంచాయతీలో పచ్చదనాన్ని ప్రతింబింభించేలా ప్రకృతి వనాలు ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడంతో అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో పాటు పాలక వర్గం సభ్యులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఏ గ్రామంలో లేని విధంగా పూర్తి స్థాయిలో ఔషధ మొక్కలు, పండ్లు, ఫలాలనిచ్చే మొక్కలు నాటారు. అటవీ సంపదను పెంచే మొక్కలను కులబ్గూర్ పల్లె ప్రకృతి వనంలో నాటి జిల్లాకే ఆదర్శంగా నిలపాలి.
గ్రామ పంచాయతీ పరిధిలోని సదాశివనగర్ కాలనీ, మహ్మద్ షాపూర్ తాండల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో ఇప్పటి వరకు 8 వేల వివిధ రకాల మొక్కలను నాటారు. ఇందు కోసం ఉపాధి హామీ పథకం నిధులను ఖర్చు చేశారు. కూలీలకు చేతినిండా పని కల్పించడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు వారిని ఉపయోగిస్తున్నారు. కులబ్గూర్ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వనంలో రూ.6.40 లక్షలు ఖర్చు చేసి ఔషధ మొక్కలు, ఫలాలు ఇచ్చే మొక్కలకు ప్రాధన్యతనిచ్చి నాటారు.
పల్లె ప్రకృతి వనం అనగానే ఏవో కొన్ని మొక్కలు నాటి వదిలేస్తారని మాములుగా జనాలకు వచ్చే ఆలోచన. కానీ ప్రకృతి వనం చుట్టూ మొక్కలను మంచపై నుంచే చూసి పర్యవేక్షించే విధంగా మధ్యలో ఏర్పాటు చేసుకుని నిఘా పెడుతున్నారు. ప్రతిరోజు కృష్ణ, అరుణ ఉదయం ప్రకృతి వనానికి చేరుకుని మొక్కల సంరక్షణతో పాటు వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేస్తారు. మంచపై ఎక్కి వనం చుట్టూ చూస్తూ పర్యవేక్షిస్తారు. ఔషధ మొక్కల వనంగా తీర్చిదిద్దడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రకృతి వనంలో 116 రకాల మొక్కలను నాటి ప్రకృతి వనాన్ని వినుత్నంగా తయారు చేస్తున్నారు. దట్టమైన అటవీని తలపించేలా వనంలో అన్ని రకాల మొక్కలు నాటి ప్రతినిత్యం సంరక్షణ చేయడం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనాలు మొక్కలతో పచ్చదనాన్ని సంతరించున్నది. గత కొంత కాలం గా అంతరించిపోతున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి అందించే మొక్కల సంరక్షణకు నడుం బిగించింది. పల్లె ప్రకృతి వనాల్లో 116 రకాలకు పైగా పండ్లు, ఔషధ మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం తెలంగాణ సర్కారుకే దక్కింది. అందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి వనాల పచ్చగా తయారు చేయాలని అధికారులను ఆదేశించడంతో ప్రకృతి వనాలు ఏర్పడ్డాయి.
మొక్కలతోనే మానవాళికి మనుగడ సాగుతున్నది. పుట్టిన ప్రతి జీవరాశులు మనుగడ సాధించడానికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అలాంటి స్వచ్ఛమైన గాలి కోసం ఎన్నో విధాలుగా వెతుకుతున్న ప్రజలు మొక్కలు నాటడంపై దృష్టి సారిస్తే భవిష్యత్తు బంగారమౌతుంది. ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి సంరక్షణ చేస్తే స్వచ్ఛమైన గాలితో పది కాలాలపాటు మానవాళికి ఎలాంటి ఢోకా ఉండదని గుర్తించింది. సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్‌గూర్‌లో 146 రకాలకు పైగా వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ చేస్తున్నారు. అంతే కాకుండా వనం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు సుగంధ పరిమళాలు వెదజల్లే స్వచ్ఛమైన గాలి ఆస్వాదించే అవకాశం కల్పించాం.
పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటేందుకు గాను ఉపాధి హామీ పథకంలో పనిలో చేరాను. ఏడాదిగా ఎకరా భూమిలో చాలా రకాల పండ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటాం. నేను నా భార్య,నేను ఇద్దరం కలిసి ఉదయం వనానికి వచ్చి మొక్కల పెరుగుదల, కలుపు తీయుట వంటి పనులు చేస్తున్నాం. మొత్తానికి వనం అంటే అటవీలో ఉండేది.. కానీ మా గ్రామంలో చిట్టడవి తయారు చేసిన.. గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అధికారులకు ధన్యవాదాలు.