గంజాయిపై యుద్ధ్దానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి పీడను పూర్తిగా తొలిగించాలని ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో గంజాయి నిర్మూలనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎక్సైజ్, పోలీసు అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్, పోలీసు అధికారులు గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను పూర్తిగా అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రత్యేక అధికారుల బృందంతో దాడులు నిర్వహించడంతో పాటు పోలీసులతో కలిసి గంజాయి రవాణాను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం సంగారెడ్డిలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు చేసి గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేసి గంజాయిని తుదముట్టించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సిద్దిపేట, మెదక్‌లో గంజాయి కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మాత్రం గంజాయి సాగు, రవాణా, సేవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దీంతో ఎక్సైజ్, పోలీసు అధికారుల దృష్టి అంతా సంగారెడ్డి జిల్లాపై ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పోలీసులతో కలిసి ఉమ్మడిగా తనిఖీలు, దాడులు నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధవుతున్నారు. పోలీసు ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని గంజాయి రవాణా, అమ్మకాలు పూర్తిగా చెక్‌పెట్టేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు.
గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల స్మగ్లింగ్‌పై అధికార యంత్రాంగం యుద్ధం చేయనున్నది. సమాజానికి హానికరమైన, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల పీడను తొలిగించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్, పోలీసు అధికారులు ఆ దిశగా సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సిద్దిపేట, మెదక్‌లో తీవ్రత, కేసులు తక్కువగా ఉన్నా, సంగారెడ్డి జిల్లాలో మాత్రం గంజాయి సాగు, రవాణా, సేవించే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నది. దీంతో ఈ జిల్లాపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దున ఉండడంతో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చాపకింద నీరులా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఇంటలిజెన్స్ సహాయంతో వీటికి చెక్‌పెట్టేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమవుతున్నది.
సంగారెడ్డి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)/మెదక్/అందోల్ : మార్కెట్లో గంజాయికి ఎక్కువగా డిమాండ్ ఉన్నది. కిలో గంజాయి రూ.1000 నుంచి రూ.12,000 వరకు ధర పలుకుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా మంది రైతులు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. ఎక్సైజ్, పోలీసులకు తెలియకుండా కొంతమంది రైతులు గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నారు. రైతుల ముసుగులో కౌలుదారులు ఎక్కువగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయితో యువత భవిష్యత్తు నాశనం అవుతున్నా కొంతమంది లాభాపేక్షతో సాగుచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉంది. మెదక్ జిల్లాలో రేగోడ్ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి సాగవుతున్నది. ఇక సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో గంజాయి ఎక్కువగా సాగవుతున్నది. గతంలో పోలిస్తే నారాయణఖేడ్ నియోజకవర్గంలో గంజాయి సాగు 75శాతం మేర తగ్గింది. ఇంకా కొంత మంది గంజాయి సాగు చేస్తున్నారు. వానకాలం సీజన్లో మహారాష్ట్రలోని ఉద్గిర్ ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారులు నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులను కలిసి గంజాయి విత్తనాలు అందజేసి సాగును ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని రైతులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. గంజాయి సాగుచేసే వారికి డబ్బులు ఆశ జూపుతున్నారు. దీంతో రైతులు సాగుకు మొగ్గుచూపుతున్నారు. జొన్న, చెరుకు, కంది, పత్తి పంటల్లో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, నాగల్గిద్ద, కంగ్టి, సిర్గాపూర్ మండలాల్లో తండాలు, కొన్ని గ్రామాల్లో గంజాయి సాగుచేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో గంజాయి సాగుచేస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లోని వారు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. రోడ్లు లేని గ్రామాలవైపు ఎక్సైజ్, పోలీసులు వెళ్లి దాడులు చేయలేని పరిస్థితి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది మారుమూల గ్రామాలు, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాల్లోని వారు గంజాయి సాగు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కౌలుదారులు ఎక్కువగా సాగు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా శీలవతి, ఒరిస్సా, గొండ రకం గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో శీలవతి రకం గంజాయికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. శీలవతి రకం గంజాయి నాణ్యమైనది కావడంతో కిలోకు రూ.8,000 నుంచి రూ.12,000 వరకు చెల్లించేందుకు గంజాయి ఏజెంట్లు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి సాగు చేస్తున్నవారిని గుర్తించి ఎక్సైజ్ అధికారులు మొక్కలు ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు.ఈ ఏడాది ఇప్పటి వరకు 14 చోట్ల దాడులు నిర్వహించిన 10,987 గంజాయి మొక్కలను నాశనం చేశారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. గంజాయి సాగు చేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు.
ఏవోబీ మీదుగా అక్రమ రవాణా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండు గంజాయి ఎక్కువగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి జిల్లాలోకి ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇటీవల మునిపల్లి బుధేరా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు 240 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేసేవారిని ట్రాన్స్‌పోర్టర్లుగా, నిల్వచేసేవారిని డీలర్లుగా, గంజాయి విక్రయించేవారిని ఏజెంట్లుగా పిలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి అక్రమ పద్ధ్దతుల్లో ఎండు గంజాయిని ఉమ్మడి మెదక్ జిల్లాలోకి, ఆపై కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. విశాఖపట్నం ప్రాంతంలో ఎండుగంజాయి అమ్మేవారికి తెలుగు తప్ప ఇతర భాషలు రావు. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన గంజాయి డీలర్లు జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు చెందిన వారిని ట్రాన్స్‌పోర్టర్లుగా నియమించుకుని గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి ట్రాన్స్పోర్టర్లు ఏవోబీ నుంచి కూరగాయల వాహనాలు, పప్పుదినుసులు రవాణా చేసే వాహనాలు, బొగ్గు రవాణా చేసే వాహనాల్లో గంజాయి అక్రమంగా జిల్లాలోకి, ఆపై మహారాష్ట్ర, కర్ణాటకలో గుట్టుగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా రవాణా చేసి తీసుకువచ్చిన గంజాయిని ట్రాన్స్పోర్టర్లు డీలర్లకు అప్పగించగా, డీలర్లు వాటిని తమ ఇండ్లు లేదా ఇతర ప్రాంతాలో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లోని డీలర్లు గంజాయిని గోదాముల్లో నిల్వ చేసి వాటిని ఏజెంట్లకు అందజేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి మీదుగా కర్ణాటకలోని హుబ్లీకి గంజాయిని తరలించి, అక్కడ నుంచి కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు గంజాయి రవాణా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. నారాయణఖేడ్, జహీరాబాద్ మీదుగా గంజాయిని ఉద్గిర్కు తరలించి, అక్కడి నుంచి ముంబయి వరకు తరలిస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా వేస్తున్నారు. అకస్మిక దాడులు చేసి నిల్వలను పట్టుకుంటున్నారు. ఈ ఏడాటి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు 33 కేసులు నమోదు చేసి 61 మంది గంజాయి రవాణా, విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు. గంజాయి రవాణా చేస్తున్న19 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 866.29 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
యువకులు, విద్యార్థులే టార్గెట్
ఉమ్మడి మెదక్ జిల్లాలో గుట్టుగా గంజాయి దందా సాగుతున్నది. గంజాయి విక్రేతలు(ఏజెంట్లు) అన్ని వయస్సుల వారికి అమ్మి లాభాలు గడించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు గంజాయి విక్రేతలు టార్గెట్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని యువకులు, విద్యార్థులకు ఎక్కువగా గంజాయి విక్రయిస్తున్నారు. గంజాయి మత్తుకు ఒక్కమారు అలవాటు పడినవారు త్వరగా మర్చిపోలేరు. దీంతో యువకులు, విద్యార్థులను సులువుగా గంజాయికి అలవాటు పడేలా చేసి, వారి నుంచి ఎక్కువగా డబ్బులు గుంజుతున్నారు. గంజాయి విక్రయాల కోసం యువకులు, విద్యార్థులు వాట్సాప్ గ్రూపలు రూపొందించి గుట్టుగా గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి మత్తులో యువకులు, విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నా యి. దీంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని పటాన్చెరు, సంగారెడ్డిలోని పారిశ్రామిక వాడల్లో గంజాయి అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. పరిశ్రమల్లో ఎక్కువగా ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది గంజాయి సేవనానికి బానిసలు అవుతున్నారు. కార్మికులు ఎక్కువగా గంజాయి కొనుగోలు చేస్తుండడంతో పటాన్చెరు నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆకస్మికదాడులు చేసి గంజాయి అమ్ముతున్నవారిని, కొనుగోలు చేసినవారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా పనిచేసేందుకు సిద్దం అవుతున్నాయి. పోలీసు ఇంటలిజెన్స్ విభాగం ద్వారా గంజా యి రవాణా, అమ్మకాల వివరాలను సేకరించి వారిని పట్టుకునేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతున్నది. దీనికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.
ఉక్కుపాదం మోపుతాం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఏడాదిగా ఉమ్మడి మెదక్ జిల్లా లో టాస్క్ఫోర్సు బృందాల ద్వారా క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నాం. గత ఐదేండ్లలో 177 కేసులు నమోదు చేసి 316 మంది ని అరెస్టు చేశాం. 5,211 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశాం. గంజాయి సాగుకు సంబంధించి గత ఐదేండ్లలో 125 కేసులు నమోదు చేసి 141 మంది అరెస్టు చేశాం. 1,03,493 గంజాయి మొక్కలు ధ్వంసం చేశాం. పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడు లు చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు, రవాణా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఇందుకోసం ఎక్సైజ్ శాఖలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. గంజాయి విక్రేతలకు సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులు, పోలీసులకు తెలియజేయాలి. గంజాయి సాగుచేసే వారికి రైతుబంధు, రైతుబీమా పథకాలకు దూరం కావాల్సి వస్తుంది. రైతులు, కౌలుదారులు గంజాయి సాగు చేయవద్దు. మీ చర్యలతో యువత భవిష్యత్తు దెబ్బతింటుంది.
-కేఏబీ శాస్త్రి, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, సంగారెడ్డి
నిఘా పెడుతున్నాం..
ఎండు గంజాయిపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాం. జిల్లాలో గంజాయి అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆ దిశగా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశాం. గంజాయి సాగు, విక్రయాలు, రవాణాపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. 9440902738కు సమాచారం ఇవ్వాలి.
-రజాక్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, మెదక్