
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి
సంగారెడ్డి, ఆగస్టు 21: న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన ప్యానెల్ లాయర్ల్లు తమ నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, దీనికిగానూ రిసోర్స్ పర్సన్ల సేవలు వినియోగించుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ లాయర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ ప్యానెల్ లాయర్ల నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. హైకోర్టు నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్లు చాలా కాలంగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని, చాలా కేసులు వాదించి, కక్షిదారులకు ఊరట కలిగించారని గుర్తుచేశారు. రిసోర్స్ పర్సన్ల సూచనలు, సలహాలు న్యాయవాదులకు ఉపయోగపడుతాయని, రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వడానికి రావడం మంచి అవకాశమని, ఇది న్యాయవాదుల నైపుణ్యాన్ని మెరుగు పరుస్తుందని ఆకాంక్షించారు. అనంతరం నంద, నారాయణ మాట్లాడుతూ ప్యానెల్ లాయర్లకు వివిధ చట్టాలపై రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, ప్రత్యేక ఎైక్సైజ్ కోర్టు న్యాయమూర్తి దేవేంద్ర బాబు, ప్యానెల్ లాయర్లు, న్యాయసేవాధికార సిబ్బంది, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.