
ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రానున్న మౌలిక వసతులు
ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ సర్కారు
సీడీపీ నిధుల నుంచి 40శాతం కేటాయించాలని మార్గదర్శకాలు
ప్రభుత్వానికి సర్వే నివేదికలు పంపిన అధికారులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. మెరుగైన విద్యతో పాటు అనుకూల వాతావరణం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు గానూ విద్యాశాఖకు ఇచ్చే నిధులతోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) కింద ఏటా కేటాయించే రూ.5కోట్ల నిధుల్లో 40శాతం(రూ.2కోట్లు) ఖర్చు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులపై సర్వే చేయించింది. ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేసింది. అలాగే విద్యార్థులను క్రీడలవైపు మళ్లించేందుకు మైదానాలు నిర్మించాలని కోరింది.
సంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేయడంతో పాటు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి వసతులు కల్పించాలన్న అంశంపై సర్వే జరిపింది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. దాని ప్రకారం సర్కారు త్వరలో నిధులు కేటాయించనున్నది.
సీడీపీ నిధుల నుంచి సింహభాగం..
ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా సమకూర్చే నిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ప్రత్యేకంగా ఏటా కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) నిధుల నుంచి ఖర్చు చేయనున్నది. ఏటా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీడీపీ కింద రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులు కేటాయించింది. ఈ నిధుల్లో సింహభాగం 40 శాతం, అంటే రూ.2కోట్ల నిధులు ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో మౌలిక వసతులకు ఖర్చు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాల మేరకు జిల్లాలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో అదనపు గదులు, టాయిలెట్లు, తాగునీటి సరఫరా తదితర పనులు చేపట్టనున్నారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితోపాటు జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు మౌలిక వసతులకు కల్పనకు చేయనున్నారు.
ప్రభుత్వానికి నివేదికలు.. ప్రతిపాదనలు..
విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 1261 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేను అనుసరించి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని పాఠశాలల నివేదికలు సిద్ధం అయ్యాయి. 530 పాఠశాల్లో అదనపు తరగతి గదులు, 202 పాఠశాలల్లో తాగునీటి సరఫరా సౌకర్యం, 1039 పాఠశాలల్లో టాయిలెట్లు(బాలుర కోసం 606, బాలికల కోసం 433) నిర్మించాల్సి ఉంది. 578 పాఠశాలల్లో ప్రహరీ, 58 పాఠశాలల్లో కరెంటు సౌకర్యం కలిపించాల్సి ఉంది. ఆయా పనులు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. జిల్లాలోని విద్యార్థులను క్రీడలవైపు మళ్లించేందుకు 678 పాఠశాలల్లో క్రీడా మైదానాల నిర్మించాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది.