
102, 108 వాహనాల సేవలను
పరిశీలించిన జీవీకే ఈఎంఆర్ఐ బృందం
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 19 : జిల్లాలో అందిస్తున్న 102 (అమ్మ ఒడి), 108 ఎమర్జెన్సీ వాహనాల సేవలు, పనితీరును జీవీకే ఈఎంఆర్ఐ తెలంగాణ రీజినల్ మేనేజర్ ఖలీద్, 10 మంది సభ్యుల బృందం గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న 102 సిబ్బంది సేవలు, పనితీరుపై వారు తగు సలహాలు, సూచనలు చేశారు. జిల్లా ప్రధాన కేంద్రంలో జీవీకే ఈఎంఆర్ఐ బృందం, డీఎంఅండ్‌హెచ్‌వో గాయత్రీదేవితో మాట్లాడి 102 అమ్మ ఒడి వినియోగం, సేవలను అడిగి తెలుసుకున్నారు. 102, 108 రికార్డులను పరిశీలించి, వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లాలో గర్భిణులకు త్వరితగతిన సేవలు అందిస్తున్నాయని, వైద్య పరీక్షల తర్వాత 102లో నిర్వర్తించే సిబ్బంది సత్ సంబంధాలు కలిగి ఉండాలని వారు చెప్పారు. 102 అమ్మ ఒడి వాహనాలు అన్ని మండలాల్లో తనిఖీలు చేసి తగిన సలహాలు తెలిపామని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రీజినల్ మేనేజర్ ఖలీద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్సులు 15, 102 అమ్మ ఒడి వాహనాలు 15 ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ప్రతి రోజు నాలుగు సార్లు, 15 మంది లబ్ధిదారులను రోజుకు సగటున జిల్లా వ్యాప్తంగా గర్భిణులు సేవలు పొందుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జీవీ కే ఈఎంఆర్ఐ ప్రోగ్రాం మేనేజర్లు షేక్ జాన్ షైద్, నరేందర్, లక్ష్మణ్, హెచ్ఆర్ కిరణ్ కిశోర్, స్టోర్ ఇన్చార్జి సత్యనారాయణ, బృందం సభ్యులు పాల్గొన్నారు.