
సంగారెడ్డి, ఆగస్టు 18 : గంజాయి విక్రయాలపై నిఘా పెట్టాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్ పోలీసులకు సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసులను తీవ్రంగా పరిగణించాలని, గంజాయి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. నమోదైన కేసుల్లో సాక్షుల స్టేట్మెంట్ను సంబంధిత కోర్టు ద్వారా సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలని, ఆలస్యం చేస్తే సాక్ష్యాన్ని మార్చే అవకాశం ఉంటుందన్నారు. సమస్యలులేని చిన్న కేసులు, పిటీషనర్ల విచారణను ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లకు ఇవ్వాలని, దీని ద్వారా ఎస్‌హెచ్‌వోలు ముఖ్యమైన కేసులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. కేసుల కన్విన్షన్ రేటు పెంచడం కోసం కోర్టు కానిస్టేబుల్ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని చెప్పారు. ఏ కేసులోనైనా సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయకూడదని, మహిళను పగటి పూట అరెస్ట్ చేస్తే వెంటనే రిమాండ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేసన్‌లో ఉన్న రికార్డుల నిర్వహణకు సంబంధించిన 5 ఎస్ సిస్టమ్‌ను అన్ని పోలీస్స్టేషన్లలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.సృజన, డీఎస్పీలు సత్యనారాయణరాజు, శంకర్రాజు, భీమ్‌రెడ్డి, బాలాజీ, డీసీఆర్బీ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్బీ సీఐ మహేశ్‌గౌడ్, సబ్ డివిజన్ల సీఐలు పాల్గొన్నారు.