
జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు అన్నివిధాలా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ట్రైడెంట్ పరిశ్రమ గతేడాది క్రషింగ్ చేపట్టలేదు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించి రైతులకు అండగా నిలిచింది. ఈ ఏడాది ట్రైడెంట్ పరిశ్రమ క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ పరిశ్రమ క్రషింగ్ ప్రారంభిస్తే ఓకే, లేకపోతే రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. జహీరాబాద్ ప్రాంతంలో పండిన చెరుకును సంగారెడ్డి, కామారెడ్డి, మాగి షుగర్ ఫ్యాక్టరీలకు తరలించేలా ఆ పరిశ్రమలతో ప్రభుత్వం మాట్లాడి ఒప్పించింది. జహీరాబాద్ ప్రాంతంలో ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నుల చెరుకు దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. రైతులు పండించిన పూర్తిస్థాయి చెరుకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
జహీరాబాద్, సెప్టెంబర్ 16 : తెలంగాణలోనే అత్యధికంగా చెరుకును జహీరాబాద్‌లో సాగుచేస్తారు. ఇక్కడ నాణ్యమైన ఎర్ర, నల్లరేగడి భూములు ఉండడంతో చక్కెర రికవరీ శాతం అధికంగా ఉంటుంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని సంగారెడ్డి గణపతి చక్కెర ఫ్యాక్టరీ, కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీ, నిజాంసాగర్‌లో ఉన్న మాగి చక్కెర ఫ్యాక్టరీలు ఇక్కడి చెరుకు పంటను కొనుగోలు చేస్తుంటాయి, జహీరాబాద్ మం డలం కొత్తూర్(బి) గ్రామంలోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమను యాజమాన్యం గతేడాది నుంచి క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో ఈ ప్రాంత చెరుకు రైతులకు ఇబ్బందిగా మారింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించింది. ఈ ఏడాది ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంత్రి తన్నీర్ హరీశ్‌రావు హైదరాబాద్‌లో ట్రైడెంట్‌తో పాటు ఇతర ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ఇటీవల సమావేశం నిర్వహించి క్రషింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఇతర ఫ్యాక్టరీలకు చెరుకు రవాణా…
పూర్తిస్థాయిలో క్రషింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 8 లక్షల టన్నుల చెరుకు దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ, రైతులు 10 లక్షల టన్నులకు పైగా చెరుకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర చెరుకు అభివృద్ధి కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా చెరుకు అభివృద్ధి అధికారులు జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు సాగు, దిగుబడిని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి గణపతి చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో 2.5 లక్షల టన్నుల చెరుకు సాగులో ఉందని అధికారులు అంచనా వేశారు. గణపతి చక్కెర పరిశ్రమ సీజన్లో 6.5 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసే సామ ర్థ్యం కలిగి ఉంది. చెరుకు అభివృద్ధి అధికారుల లెక్కన సంగారెడ్డి గణపతి చక్కెర ఫ్యాక్టరీకి ఈ సీజన్లో 4 లక్షల చెరుకు అవసరం ఉంటుంది. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోని ఈ 4 లక్షల టన్నుల చెరుకును సంగారెడ్డి గణపతి ఫ్యాక్టరీకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. జహీరాబాద్ ప్రాంతంలో 8 లక్షల టన్నుల చెరుకు గాను 4 లక్షలు సంగారెడ్డి ఫ్యాక్టరీకి, మిగతా 4 లక్షల టన్నుల చెరుకును కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి, నిజాంసాగర్‌లో ఉన్న మాగి ఫ్యాక్టరీకి తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. తద్వారా జహీరాబాద్‌లో రైతులు పండించిన పూర్తిస్ధాయి చెరుకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది.
చెరుకు మద్దతు ధరలు ప్రకటించిన యాజమాన్యాలు…
చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు 2021-22 సంవత్సర చెరుకు మద్దతు ధరను ఖరారు చేశారని చెరుకు అభివృద్ధి అధికారులు తెలిపారు. సంగారెడ్డిలోని గణపతి చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు మద్దతు ధర టన్నుకు రూ. 3,090 వేలుగా ఖరారు చేసిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ మద్దతు రూ. 3,270, నిజాంసాగర్ మాగి ఫ్యాక్టరీ రూ. 3,170 వేలు ఖరారు చేసినట్లు తెలిపారు. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ ప్రారంభిస్తే మద్దతు ధర ఎంత ప్రకటిస్తారో చూడాలి.
అగ్రిమెంట్ చేసుకోలేదు…?
చెరుకు అభివృద్ధి చట్టం ప్రకారం ఒక ఫ్యాక్టరీ తన పరిధిలోని రైతు పొలంలో ఉన్న చెరుకును క్రషింగ్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఫాం-2 ప్రకారం రైతు పొలంలో ఉన్న చెరుకును అగ్రిమెంట్ చేసుకొని క్రషింగ్ సీజన్లో ఫ్యాక్టరీ తీసుకుంటుంది. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో రైతులతో అగ్రిమెంట్ చేసుకోలేదు. దీంతో కోతకు వచ్చిన చెరుకును క్రషింగ్ చేసే బాధ్యత ఫ్యాక్టరీకి లేదని చెరుకు అభివృద్ధి చట్టాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చెరుకు రైతులకు నష్టాలు రాకుండా ఉండేందుకు ఇతర ఫ్యాక్టరీలకు తరలించడం,ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నది. 2019-20కు సంబంధించి ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ రైతులకు బిల్లులు ఏడాది వరకు చెల్లించలేదు. 2020-21లో క్రషింగ్‌ను ప్రారంభించలేదు. చెరుకు రైతుల ముసుగులో ప్రతిపక్షాలు, కొందరు కుట్రలు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం చెరుకు రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నది.
ట్రైడెంట్‌లో క్రషింగ్‌కు యాజమాన్యం ఏర్పాట్లు
జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) గ్రామంలోని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఇటీవల మంత్రి తన్నీర్ హరీశ్‌రావు నిర్వహించిన సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చెరుకు అభివృద్ధి కమిషనర్, ట్రైడెంట్ ఫ్యాక్టరీ చైర్మన్ నందకుమార్‌తో సంగారెడ్డి గణపతి ఫ్యాక్టరీ ప్రతినిధులు, కామారెడ్డి జిల్లాలోని గాయత్రి, మాగి ఫ్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు. నవంబర్ 15 వరకు క్రషింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఈ సమావేశంలో ట్రైడెంట్ చైర్మన్ నందకుమార్ తెలిపారు. ఒప్పంద ప్రకారం ఈ ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నులు క్రషింగ్ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిన చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. చెరుకు రైతులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపడుతున్నది.