
సంగారెడ్డి, సెప్టెంబర్ 11: రాజీమార్గంతో కేసులు పరిష్కారం కానున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో 4,857 కేసులు రాజీ చేసుకోవడం సంతోషకరమన్నారు. లోక్ అదాలత్‌లో అత్యధికంగా 3,446 క్రిమినల్ కాంపౌండ్బుల్ కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. అలాగే, బాధితులకు రూ.90 లక్షల నష్టపరిహారం అందించామన్నారు. సివిల్ కేసులు-30, మోటరు వాహన కేసులు-33, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు-3446, బ్యాంకు రికవరీ కేసులు-125, విద్యుత్ చౌర్యం కేసులు-1223 లను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశామని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. లోక్ అదాలత్‌లో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సునీత, జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి కర్ణకుమార్, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, స్పెషల్ ఎక్సైజ్ కోర్డు న్యాయమూర్తి దేవేంద్రబాబు, న్యాయవాదులు, పోలీసుశాఖ, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
వెయ్యి కేసుల పరిష్కారం
సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 11 : సిద్దిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించి కక్షిదారులకు ఉపశమనం కల్పించామని సిద్దిపేట జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి నీలిమ ఇరువర్గాల సమ్మతితో కేసులను రాజీ కుదిర్చి అప్పటికప్పుడే కొట్టివేశారు. సివిల్ పూజ కందుకూరి పలు కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించారు. లోక్ అదాలత్‌లో సివిల్, మెయింటనెన్స్ వెయ్యి కేసులను రాజీ కుదిర్చారు. ఇందులో రోడ్డు ప్రమాద బాధితులకు రూ.43 లక్షల నష్టపరిహారాన్ని అందించారు. పీఎల్సీ కేసులు, బ్యాంకు రికవరీ 12 కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, న్యాయవాదులు సాయిబాబా, లింగయ్యగౌడ్, తిరుపతిరెడ్డి, రఘుపతిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మణి, పత్రి ప్రకాశ్ ఉన్నారు.
గజ్వేల్ కోర్టు పరిధిలో 1689 కేసుల పరిష్కారం
గజ్వేల్, సెప్టెంబర్ 11 : గజ్వేల్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1689 కేసులు పరిష్కరించినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ చైర్మన్ రవీందర్ సట్టూ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళీప్రసాద్, న్యాయవాదులు బాలముకుందరెడ్డి, వనం భాస్కర్, పారాలీగల్ సిబ్బంది నర్సింహచారి, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో ఖర్చు, సమయం ఆదా
జహీరాబాద్, సెప్టెంబర్ 11 : జహీరాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పెం డింగ్ కేసులు పరిష్కరించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు రాజీమార్గంలో ముందుకొచ్చి తమ కేసులు పరిష్కరించుకోవాని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ అన్నారు. జహీరాబాద్ డివిజన్లోని జహీరాబాద్ పట్టణ, రూరల్, చిరాగ్పల్లి, కోహీర్, హద్నూర్, ఝరాసంగం, రాయికోడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
125 కేసులు..
నారాయణఖేడ్, సెప్టెంబర్ 11: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని లోక్ అదాలత్ కల్పిస్తున్నదని నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ప్రియాంక అన్నారు. శనివారం నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్‌లో మొత్తం 125 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా పోలీస్స్టేషన్ల ఎస్సైలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జోగిపేట కోర్టులో 92 కేసులు..
అందోల్, సెప్టెంబర్ 11: న్యాయసేవాధికార సం ఘం ఆధ్వర్యంలో శనివారం జోగిపేట కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 492 కేసులు పరిష్కరించినట్లు జోగిపేట కోర్టు జడ్జి సంపత్ చెల్లూరి తెలిపారు. అందోల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, పుల్కల్ తదితర మండలాలకు చెందిన పెండిగ్ కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయ వాధులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.