మూడు రాష్ర్టాల సరిహద్దున ఉన్న జహీరాబాద్‌లో గంజాయి సాగు, స్మగ్లింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఆబ్కారీ, పోలీస్ శాఖల దాడుల్లో నిత్యం ఎక్కడో చోట బయటపడుతున్నది. వారం వ్యవధిలో రూ.2 కోట్ల పైచిలుకు విలువైన సరుకు పట్టుబడడం దీనిని నిజం చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న గ్రామాల్లో పలువురు రైతులు పత్తి, చెరుకు, అల్లంతోటల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలోనూ సాగువుతున్నది. మహారాష్ట్ర్ర్టకు చెందిన గంజాయి స్మగ్లర్లు జూన్‌లో రైతులకు విత్తనాలు సరఫరా చేసి సాగుచేయిస్తున్నారు. పంట చేతికి రాగానే కొనుగోలు చేస్తున్నారు. అమాయక రైతులకు డబ్బు ఆశచూపి, మాయమాటలు చెప్పి సాగును ప్రోత్సహిస్తున్నారు. సాగుచేసిన గంజాయిని వాహనాలు, రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నా దీనికి అడ్డుకట్ట పడడం లేదు.
జహీరాబాద్, అక్టోబర్ 9 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో గంజాయి గుప్పుమంటున్నది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో పలువురు రైతులు పత్తి, చెరుకు, అల్లంతోటల్లో సాగు చేస్తున్నారు. మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో గంజాయి సాగుచేస్తున్న ఘటనలు పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది దాడుల్లో వెలుగు చూస్తున్నాయి. మంజీరా నదీ తీరంతో పాటు మారుమూల అటవీ ప్రాంతాల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో సాగుచేసిన గంజాయిని స్మగ్లర్లు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ టావెల్స్ బస్సులు, రైళ్లు, కార్లు, ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు యువకులు గంజాయి రవాణాను వృత్తిగా మార్చుకుని రవాణా చేస్తున్నారని తెలిసింది. గతంలో గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటకకు రవాణా చేసేందుకు కొందరు యువకులు కార్లు కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా సరిహద్దు దాటించారు. ఆంధ్రాలోని విశాఖ, తెలంగాణలోని భద్రాచలం, ఒడిశా ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేసిన ఘటనలు పోలీసుల దాడుల్లో వెలుగు చూశాయి. జహీరాబాద్ డివిజన్లోని న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్, జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి మండలాల్లో గంజాయి సాగవుతున్నది. ఇటీవల న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల్లో పత్తి, చెరుకు తోటల్లో సాగుచేసిన గంజాయి మొక్కలను ఎక్సైజ్, సివిల్ పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్చివేశారు.
విత్తనాలిచ్చి…
మహారాష్ట్రకు చెందిన గం జాయి స్మగ్లర్లు జూన్‌లో రైతులకు విత్తనాలు సరఫరా చేసి పంట చేతికి రాగానే కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచా రం. గంజాయిని ప్రధానంగా రైతు లు పత్తి, చెరుకు, అల్లం తోటలో సాగుచేస్తున్నారు. పత్తి పంటలో చీడపీడను నివారించడానికి సాధారణంగా రైతులు బంతిపూల మొక్కలను నాటుతుంటారు. గంజాయి కూడా బంతి మొక్కలు పోలి ఉండడంతో కొన్నిచోట్ల వీటితో పాటు గంజాయి సాగుచేస్తున్నారు. మహారాష్ట్ట్రకు చెందిన గంజాయి మాఫియా జహీరాబాద్ డివిజన్లోని మారుమూల గ్రామాల్లో అమాయక రైతులకు మాయమాటలు చెప్పి సాగును ప్రోత్సహిస్తున్నారు. అమాయక రైతులకు గంజాయి స్మగ్లర్లు వానకాలంలో విత్తనాలు సరఫరా చేసి, సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. గంజాయి పంటను అక్టోబరులో కోసి ఆరబెట్టాక వచ్చి వారే నేరుగా కిలోల చొప్పున కొనుగోలు చేసి ప్రైవేటు వాహనాల్లో తరలిస్తారు. ఈనెల 4న న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఎక్సైజ్, సివిల్ పోలీసులు రూ.40లక్షల విలువ చేసే గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. రైతులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైతులు పత్తి మాటున సైతం గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు తెలిసింది.
జహీరాబాద్ కేంద్రంగా గంజాయి దందా…
65వ జాతీయ రహదారిపై జహీరాబాద్ ఉంది. ప్రతిరోజు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత ప్రజలు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్, ముంబయికి చెందిన గం జాయి స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేసేందుకు యువతను ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. గంజాయి స్మగ్లింగ్‌కు జహీరాబాద్ కేంద్ర బిందుగా మారింది. ఇక్కడి నుంచి హైదరాబాద్, ముంబయి, విశాఖ, బెంగళూర్‌కు రైల్వేమార్గం ఉండడంతో స్మగ్లర్లకు కలసి వస్తున్నది. ఎక్సైజ్, సివిల్ పోలీసులు చేసే సాధారణ తనిఖీల్లో గంజాయి రవాణా జరుగుతున్నట్లు వెల్లడవుతున్నది. ఈ ప్రాంతంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను సమూలంగా నిర్మూలించడంపై పోలీసులు, ఆబ్కారీ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గంజాయి ఆకు ముదిరాక కోసి ఎండబెట్టి ప్లాస్టిక్ కవర్లలో నింపి కిలోల చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. కిలో రూ. 10 వేల వరకు అమ్ముతున్నారు. ఎండు గంజాయిని ముంబయికి ఎక్కువగా తరలిస్తున్న తెలిసింది. స్మగ్లర్లు ఎండు గంజాయిని ముంబయిలో చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక నిఘా పెట్టాం..
జహీరాబాద్ డివిజన్లో కొందరు రైతులు పత్తి, చెరు కు తోటల్లో గంజాయి సాగుచేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే దాడులు చేసి గంజాయి మొక్కలు కాల్చివేస్తున్నాం. ఇటీవల ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి, బుర్థిపూర్తో పాటు మారుమూల గ్రామా ల్లో దాడులు చేసి గంజాయి మొక్కలు తగులబెట్టాం. గంజాయి అక్రమ రవాణా, సాగును నివారించేందుకు మారుమూల గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పా టు చేశాం. సాగుదారుల పై కేసులు నమోదు చేస్తున్నాం. జాతీయ రహదారి పై గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు ప్రత్యేకంగా వాహనలు తనిఖీలు చేపడుతున్నాం.
-అశోక్‌కుమార్, ఎక్సైజ్ సీఐ జహీరాబాద్