
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 7:తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ప్రభుత్వం విద్యాలయాలను అమెరికా తరహాస్థాయిలో అభివృద్ధి చేసిందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను స్థాపించి పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నట్టు వెల్లడించారు. గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే, ఆ జీవితానికి దారి చూపించేది ఉపాధ్యాయుడేనన్నారు. గ్రామ విద్యా కమిటీ చైర్మన్‌గా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఈ రోజు మండలి ప్రొటెం చైర్మన్ స్థాయికి వచ్చానంటే గురువు నేర్పిన విద్యతోనే అని, గురువుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మరింత అభివృద్ధి చేసేందుకు ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పని చేయాలని కోరారు.
బంగారు తెలంగాణ నిర్మాతలు కావాలి..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ తరగతి గదిలోనే జాతి నిర్మాణం జరుగుతుందని, అందుకు ఉపాధ్యాయుడే మార్గదర్శి అని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పని చేసి బంగారు తెలంగాణ నిర్మాతలు కావాలని ఆకాంక్షించారు. కొవిడ్ సమయంలో చదువుల పరంగా జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉన్నదన్నారు. త్వరలో కొత్త జిల్లాల వారీగా క్యాడర్ రాబోతున్నదని ఆయన వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం 80శాతం స్థానిక, 20శాతం స్థానికేతరులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్తర్వులు రాబోతున్నాయని, ప్రధానోపాధ్యాయులతో సహా రాష్ట్రంలోని 22 వేల మంది ఉపాధ్యాయులకు వచ్చే అక్టోబర్‌లోనే పదోన్నతులు లభిస్తాయని భరోసా కల్పించారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాది రూ.4 వేల కోట్ల అదనపు నిధులను ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిందని గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌తో వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పడనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
గురు బోధన లేని విద్యార్థి లేడు..
గురు బోధన లేని విద్యార్థి లేడని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల ప్రవర్తన, వారి నడవడిక ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొవిడ్ నిబంధనల మేరకు విద్యను కొనసాగించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదన్నారు. విద్యను మించిన ధనం మరొకటి లేదన్నారు. అనంతరం జిల్లాలో ఎంపికైన 66 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించి సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి డీఈవో నాంపల్లి రాజేశ్, ఏడీ విజయ, డీఐవో గోవిందరాం, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉత్తమ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.