పటాన్చెరు, అక్టోబర్ 5 : తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయని అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. మంగళవారం గీతమ్ విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన గీతమ్ ఛేంజ్ మేకర్స్ ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-గీతమ్ వ్యూహాత్మక కార్యక్రమాలు-విస్తరణ డైరెక్టర్ నిధి రజ్ధాని సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమంలో స్వాతిలక్రా మాట్లాడారు. వేధింపులు, దాడులకు గురైతే మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా వాట్సప్, క్యూఆర్ కోడ్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనికి ఐసీసీ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడయిందన్నారు. ఫిర్యాదు నేపథ్యం, తగిన ఆధారాలు, సాంకేతిక సహకారంతో నమోదైన కేసులను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. చాలా వరకు చిన్నకేసులేనని, తప్పులు పునరావృతం చేసేవారి సంఖ్య మైనర్లు నిందితులవడం తమను కలచివేసిందని, తల్లిదండ్రుల సమక్షంలో వారిని కౌన్సిలింగ్ చేయడం మంచి ఫలితాలను ఇస్తున్నదన్నారు. షీ టీమ్స్ బృందాలు పలు కళాశాలలను సందర్శించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గీతమ్ హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఐపీఎస్ అధికారినికి స్వాగతం పలికి సత్కరించారు.