
స్మార్ట్‌ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
మున్సిపాలిటీలు, నగర పాలికల్లో అమలుకు శ్రీకారం
కొత్త విధానంతో సులభంగా ఇంటినంబరు
21 రోజుల్లో నంబర్ కేటాయింపు
పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సర్కారు
ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు
కొత్త కాలనీల వాసులకు తీరనున్న ఇబ్బందులుఽ
ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేస్తుండడంతో ప్రజలకు సౌకర్యవంతంగా మారుతోంది. ఒకప్పుడు ఇంటి నంబర్ కోసం యజమానులు బల్దియాల చుట్టూ తిరిగితే కాని పనికాక పోయేది. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేకుండానే యజమాని ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి యజమాని సీడీఎంఏ వెబ్సైట్లోకి వెళ్లి ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యజమానులు తాము నిర్మించిన ఇంటి పూర్తి కొలతలు ఆన్లైన్లో పొందుపరిస్తే 21 రోజుల్లో నంబర్ కేటాయిస్తున్నారు. యజమా ధ్రువీకరించిన కొలతలు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దరఖాస్తుదారుడు నమోదు చేసిన వివరాల ప్రకారం ఆస్తిపన్నును అధికారులు విధిస్తారు. ఆస్తి పన్ను కూడాఆన్లైన్లో చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో యజమానులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. నూతన విధానంతో దళారులు, బ్రోకర్లకు చెక్ పడి పారదర్శకత ఏర్పడింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 3 : సొంతింటి కలను సాకా రం చేసుకుంటున్నారా… అప్పులు చేసి ఇంటిని నిర్మించారా… ఇంటినంబరు కోసం తిరుగుతున్నారా… ఇలాంటి సమస్యలకు ప్రభు త్వం చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నది. ఇంటి నిర్మాణం చేసి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండానే యజమాని ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇంటి నంబరు అనగానే దళారులు పుట్టుకొచ్చి యజమానులకు ఇబ్బందులు పెడుతున్న విషయాలను సర్కారు గుర్తించింది. అందుకోసం స్మార్ట్‌ఫోన్ ఉంటేచాలు ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విధానాన్ని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో అమలుకు శ్రీకారం చుట్టింది. కొత్త విధానంతో ఇంటి యజమానులకు ఇబ్బంది తీరనుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ సీడీఎంఏను తీసుకువచ్చి ఇంటి నంబరు దరఖాస్తుదారులకు తీపికబురు అందించింది. కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకుని ఇంటి నంబరు కోసం దళారులను ఆశ్రయించకుండా నేరుగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం సేవలను పొందాలని అధికారులు సూచిస్తున్నారు. నంబరు కోసం దరఖాస్తు చేసే యజమానులు తాము నిర్మించిన ఇంటి పూర్తి కొలతలు ఆన్లైన్లో పొందుపర్చాలి. యజమాని ధ్రువీకరించిన కొలతలు తప్పుడు సమాచారం ఇస్తే జరిమానాలు విధిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో మొత్తం 1,14,096 నివాసాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 4 బల్దియాలు, సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడుతున్న వెంచర్లు, వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాల యజమానులు ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దళారుల మాటలు నమ్మిమోసపోకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తో దరఖాస్తు చేసుకున్న త్వరలోనే ఇంటినంబరు మున్సిపల్ అధకారులు కేటాయిస్తారు.
నూతన విధానంతో సులభతరం…
మున్సిపాలిటీలు, నగరపాలికల్లో కొత్తగా ఇంటి నిర్మాణం చేసి నంబరు పొందేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ముఖ్యంగా దళారుల నుంచి యజమానులకు ఉపశమనం కలిగించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటి యజమానే ఆన్లైన్లో ఇంటినంబరు పొందే అవకాశం కల్పించింది. ఇంటి వివరాలు ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేసి నంబరు పొందవచ్చు. యజమానులు అత్యాశకు పోయి తప్పుడు కొలతలను ఆన్లైన్లో పొందుపర్చడంతో ఆస్తిపన్ను తగ్గ్గుతుందని, అతితెలివి ప్రదర్శిస్తే ఇబ్బందులకు గురికాక తప్పదు. ఆన్లైన్లో వివరాలు పొందుపర్చిన తర్వాత రెవెన్యూ అధికారుల లాగిన్లోకి వెళ్లిన వెంటనే సిబ్బంది వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తీసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తారు. ఆ సమయంలో ఆన్లైన్లో పొందుపర్చిన వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉంటే అసలు ఆస్తిపన్నుకు 25 రెట్లు అదనంగా జరిమానా విధిస్తారు. ప్రజలు ఇబ్బంది పడొద్దనే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తించి అధికారులకు సహకరించాలి. ఇంటినంబరు కేటాయింపునకు తప్పుడు సమాచారంతో ఆస్తిపన్ను తగ్గించుకునే అవకాశం ఉన్నా, తర్వాత జరిగే పరిణామాలకు యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే మున్సిపల్, రెవెన్యూ అధికారులకు పూర్తి వివరాలు అందజేయాలి.
స్మార్ట్‌ఫోన్‌పై అవగాహన ఉండాలి…
స్మార్ట్‌ఫోన్ వాడకంపై అవగాహన కలిగి ఉంటే ఎవరి అవసరం లేకుండానే ఇంటి నంబరుకు దరఖాస్తు చేయవచ్చు. గతంలో ఇంటినంబరు కావాలంటే మున్సిపాలిటీలోని బిల్కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కలిసి ఇంటి వివరాలు, వాటికి సంబంధించిన ధువ్రపత్రాలు ఇచ్చి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. దళారులు, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పనిదే ఫైలు కదిలేది కాదు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వాసారి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులకు ప్రభుత్వం చెక్‌పెడుతూ పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. వ్యక్తిగత ధ్రువీకరణ విధానంతో అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా స్మార్ట్‌ఫోన్ నుంచి సీడీఎంఏ వెబ్‌సైట్‌తో ఇంటినంబరు పొందే అవకాశాన్ని సర్కారు కల్పించింది. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమానికి స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ వస్తే చాలు ఇంటినంబరు వచ్చినట్లే. దరఖాస్తు చేసిన యజమాని ఆప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తే నేరుగా కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మున్సిపల్ మేనేజర్, కమిషనర్ లాగిన్‌కు వెళ్తుంది. వారి పరిశీలన పూర్తి కాగానే, రెవెన్యూ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 21 రోజుల్లో ఇంటినంబర్ కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు నమోదు చేసిన వివరాల ప్రకారం ఆస్తిపన్ను వస్తుంది. దానిని కూడా ఆన్లైన్లో చెల్లించే విధానాన్ని ప్రభుత్వం మూడేండ్ల క్రితమే అమలులోకి తెచ్చింది.