
వాడవాడలా ఎగిరిన గులాబీ జెండా
అంతటా సందడి.. క్యాడర్లో జోష్
ర్యాలీలు, పటాకుల మోతతో కార్యకర్తల సంబురాలు
ర్యాలీలతో సందడి వాతావరణం
జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
ఊరూవాడ గులాబీమయమైంది. అన్నిచోట్లా సగౌరవంగా గులాబీజెండా రెపరెపలాడింది. పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా గురువారం టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భూమిపూజ చేయడం గులాబీ దళంలో జోష్‌ను నింపింది. హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగురడంతో టీఆర్ఎస్ క్యాడర్ ఆనందానికి గురైంది. దీనిని పురస్కరించుకొని పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని, తీన్మార్ డ్యాన్స్‌లు చేసి సంబురాల్లో మునిగి తేలారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట/మెదక్ : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గులాబీ గుభాళించింది. పల్లెలు, పట్టణాల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు జెండా పండుగలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయటంతో జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా అంతటా టీఆర్ఎస్ నాయకులు జెండాలను ఎగురవేయడంతో పాటు ర్యాలీలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పటాకుల మోతతో ర్యాలీలు సందడిగా మారాయి. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణలతో పండుగ వాతావరణం కనిపించింది. జెండా పండుగ ముగియడంతో ఇక శుక్రవారం నుంచి టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ జరుగనున్నది. వార్డు, గ్రామ కమిటీలను ఎన్నుకోనున్నారు. జిల్లా అంతటా ఈనెల 20వ తేదీలోగా గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత జిల్లా కమిటీ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.