నారాయణఖేడ్, అక్టోబర్ 1: నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శాశ్వతంగా వలసలను నివారించే అవకాశం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే అసెంబ్లీలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తూ ప్రతియేటా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన 40 శాతం మంది ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని, దీనికి కేవలం సాగునీటి వనరులు లేక వర్షాధార పంటలపై ఆధారపడి అతివృష్టి, అనావృష్టి బారిన పడి పంటలు పండని పరిస్థితుల్లో భూస్వాములు సైతం వలస వెళ్తున్నారన్నారు. వలసలను అరికట్టే విషయంలో గత ప్రభుత్వాలు, పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వలసలను శాశ్వతంగా నివారించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించి బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి హరీశ్‌రావులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నాగల్గిద్ద, మనూరు మండల్లాల్లోని మిగతా 16 వేల ఎకరాలకు సైతం బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందించాలని కోరిన ఎమ్మెల్యే, 6,300ల ఆయకట్టు ఉన్న నల్లవాగు ప్రాజెక్టును, నారాయణఖేడ్ మండలంలోని నర్సాపూర్ చెరువు, కల్హేర్ మండలంలోని నాగధర్ చెరువు, పెద్దశంకరంపేట మండలంలోని గొట్టిముక్కుల చెరువులను బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి అనుసంధానించాలని, కర్ణాటక సరిహద్దున ఉన్న తమ నియోజకవర్గంలోని సర్దార్ తండాకు సాగునీరు అందేలా చూడాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోనే ‘ఖేడ్’కు అత్యధిక సాగునీరు
ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా సాగునీరు అందే నియోజకవర్గం నారాయణఖేడ్ అని స్పష్టం చేశారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా 1,55,928 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లో 24,928 ఎకరాలు, నల్లవాగు ప్రాజెక్టు నుంచి 4,408 ఎకరాలకు సాగునీరందుతుండగా, మొత్తం 1,85,264 ఎకరాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సస్యశ్యామలమవుతుందన్నారు. నల్లవాగు ప్రాజెక్టు సహా పలు చెరువులను బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి అనుసంధానిస్తామని, ఎత్తైన ప్రాంతాలకు సైతం సాగునీరందించే విషయమై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.
‘సంగమేశ్వర’తో బీడు భూములు సస్యశ్యామలం