పటాన్చెరు, జనవరి 30 : వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. హత్య చేసిన ఏడుగురిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భీంరెడ్డి వివరాలు వెల్లడించారు. బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెలిమెల తండాలో నివసించే కడవత్ రాజు(35) కనబడటం లేదని వారి కుటుంబ సభ్యులు 25న పోలీసులకు ఫిర్యాదు చేస్తే 26న కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా రమేశ్, విష్ణు అనే ఇద్దరు యువకులపై అనుమానంతో పోలీసులు వారిని విచారించారు. కడవత్ రాజుకు పెద్దనాన్న కుమారుడు కడవత్ రాంసింగ్ (27) పాత్ర బయట పడింది. కడవత్ రాంసింగ్, కడవత్ రాజుల మధ్య 32 గుంటల భూ వివాదం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన రాజు.. రాంసింగ్‌ను ఆ భూమిని తక్కువకు అమ్మాలని భయపెట్టేవాడు. పైగా ఒక భూ లావాదేవిలో రూ.1.5 కోట్లు వస్తే వాటిలో 50 లక్షలు రాజు వాడుకున్నాడు. ఆ డబ్బులను రాంసింగ్ అడిగితే చంపుతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో రాంసింగ్ సంగారెడ్డిలో నివసిస్తున్న ప్రకాశం జిల్లావాసి మాధవ్(38)ను కలిశాడు. కడవత్ రాజును చంపితే రూ.10 లక్షలు ఇస్తానని, అతడితో డీల్ చేసుకున్నాడు. రాజును చంపాలని వారు గట్టి ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంలో కవలంపేటకు చెందిన నీరుడి విష్ణు(26), పల్లెపు రమేశ్ (24), వెలిమెల తండాకు చెందిన కడవత్ వెంకటేశ్ (22), కడవత్ మల్లేశ్ (23), వెలిమెల తండాకు చెందిన వర్త్య బాలు(20) సాయం తీసుకున్నాడు. చివరికి 32 గుంటల భూమి కడవత్ రాజుకు అమ్ముతామని, వచ్చి అగ్రిమెంట్ చేసుకోమని కోరడంతో అతడు ఇంద్రకరణ్ పరిసరాలకు ఇన్నోవా కారులో వెళ్లాడు. అక్కడికి రమేశ్, విష్ణు, మాధవ్ ఇస్నాపూర్ నుంచి మద్యం బాటిళ్లు, కత్తి, పెట్రోల్, గొడ్డలితో వచ్చారు. కడవత్ రాజుకు మద్యం తాగించి చంపాలని వారు ప్లాన్ వేసుకున్నారు. మద్యం తాగిన రాజుతో రాంసింగ్ భూమి డీల్ చేస్తూ సాయంత్రం అయ్యేవరకు చూశారు. బయాన ఇస్తానని రాజు కారులోకి వెళ్లే సమయంలో వెనుకనుంచి విష్ణు, మాధవ్ గొడ్డలి, కత్తితో మెడపై నరికారు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మిగలినవారి సాయంతో రాజు చనిపోయేవరకు కత్తితో పొట్లు పొడిచారు. అనంతరం శవాన్ని రాజు కారులోనే తీసుకొని సంగారెడ్డి సమీపంలోకి వచ్చారు. మాధవ్ కత్తితో తలను వేరు చేశాడు. తల, మొండెం వేర్వేరు సంచిలో వేసి హస్నుర్లోని చాకలివాగులో తల విసిరేశారు. అనంతరం కత్తి, గొడ్డలి, మొండెంను రాఘపూర్ బ్రిడ్జి పరిసరాల్లో పారేశారు. హత్య చేసిన సమయంలో విష్ణు, మాధవ్, రాంసింగ్ బట్టలు రక్త సిక్తం కావడంతో వాటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం మాధవ్ రాజు కారుతో పరారయ్యాడు. రాజు ఒంటిపై ఉన్న నగలు, నగదుతో మాధవ్ వెళ్లిపోయాడు. కేసును బీడీఎల్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి ఆరుగురు నిందితులను పట్టుకున్నట్టు డీఎస్పీ వివరించారు. త్వరలోనే మాధవ్‌ను అరెస్టు చేస్తామని, కేసులో మరికొందరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అరెస్టు చేసిన ఆరుగురిని సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చినట్టు డీఎస్పీ తెలిపారు. అనంతరం హత్య కేసును ఛేదించిన సీఐలను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు వేణుగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, లాలూనాయక్, శ్రీనివాస్, ఎస్సై రామునాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.