సాధారణంగా సేద్యం అనగానే కర్షకులు ఎప్పుడూ ఒకే రకం పంట వేస్తుంటారు. మూస సాగుపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. సంప్రదాయ పంటల్లో ఏదో ఒకటి వేసి, లాభం వస్తే తీసుకుంటారు. లేదంటే నష్టాలు చవిచూస్తారు. కానీ, ఎవరైతే పంట మార్పిడి చేసి, డిమాండ్ ఉన్న రకాలు వేస్తారో కష్టానికి తగ్గ ప్రతిఫలం చూస్తారు. అలాంటి వైవిధ్య సేద్యమే చేస్తూ సైదాపూర్ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మండలంలోని రైతులంతా వరితోపాటు వేరుశనగ, పొగాకు, గోధుమ, కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడు, మక్క వేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.
హుజూరాబాద్/ సైదాపూర్, జనవరి 19 : సైదాపూర్ మండలంలో మొత్తం 19,811 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత వానకాలంలో 15వేల ఎకరాల్లో వరి చేశారు. మిగతా దాంట్లో ఇతర పంటలు వేశారు. ప్రస్తుతం ఈ యాసంగిలో 9వేల ఎకరాల్లో వరి, 6500 ఎకరాల్లో మక్క వేశారు. వరి, మక్కలో దాదాపు 4వేల ఎకరాలు సీడు రకమే ఉంది. ఇక 1500 ఎకరాల్లో వేరుశనగ, 500 ఎకరాల్లో పొగాకు, 1000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. కాగా, నీళ్లు సమృద్ధిగా ఉంటే ప్రతి రైతు వరి వేస్తుంటాడు. కానీ ఇక్కడి రైతులు రెండు రకాల పంటలు వేస్తుంటారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, గోధుమ, కుసుమ, ఆవాలు, వేరుశనగ, సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా పలు రకాల పంటలు దర్శనమిస్తాయి.
వేరు శనగలో అందెవేసిన చేయి..
సైదాపూర్ మండలం అనగానే ఒకప్పుడు వేరుశనగే గుర్తుకు వచ్చేది. వరి సాగు మోజులో పడిన రైతులు రానురాను ఆ పంట తగ్గించేశారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ వేరుశనగపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మండలంలో 1500 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఘనపూర్, ఆకునూర్, పెరకపల్లి, సైదాపూర్, గొడిశాల గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరో 400 ఎకరాలలో వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
దుద్దనపల్లిలో 50 ఎకరాల్లో గోధుమ..
దుద్దనపల్లి గ్రామంలో 50 ఎకరాల్లో రైతులు గోధుమ సాగు చేస్తున్నారు. వరికి బదులు గోధుమ వేస్తే లాభదాయకమన్న అధికారుల అవగాహన కార్యక్రమాలతో ఇటువైపు మొగ్గుచూపారు. కాగా, గోధుమను నవంబర్ మొదటి వారంలో సాగు చేయగా, ఫిబ్రవరి చివరలో పంట చేతికి వస్తుంది. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వచ్చే యేడు 200ఎకరాలకు పెంచుతామని రైతులు పేర్కొంటున్నారు.
సైదాపూర్ మండల రైతులు తీరొక్క పంటలు సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరితోపాటు ఇతర రకాలు సాగు చేస్తు ఔరా అనిపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున వేరుశనగ, పొద్దుతిరుగుడు, గోధుమ, కుసుమ, ఆవాలు, వేరుశనగ, పొగాకుతోపాటు ఆడ, మగ వరి, మక్క వేస్తున్నారు. కూరగాయల సాగులోనూ ముందంజలో ఉన్నారు.
యాసంగిల పత్తి పెట్టిన..
నాకు మూడు ఎకరాల భూమి ఉంది. గతంలో మొత్తం వరి వేసిన. ఇప్పుడు వడ్లు కొనరని వాళ్లు వీళ్లు మాట్లాడుకొంటుంటే విన్న. ఎందుకైనా మంచిదని ఇప్పుడు ఎకరంన్నలో పొద్దుతిరుగుడు, మిగతా దాంట్లో పత్తి పెట్టిన. కేసీఆర్ సారు ఎవుసానికి అన్ని రకాల సౌలతులు చేసిండు. కానీ కేంద్రం చేసే చాష్టలు చూస్తుంటే బతుకు కష్టమే అనిపిస్తుంది.
శెనిగ వేసిన..
నాకు మా ఊళ్లే మూడు ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరంన్నరలో పప్పు శెనిగ వేసిన. మరో 20 రోజులలో కోతకు వస్తుంది. చలికాలంలో కొద్ది పాటి తడికే పండుతుంది. 100 రోజులల్లో పంట చేతికి వస్తుంది. పెట్టుబడి దున్నుడుకు తప్ప వేరే ఖర్చులు ఉండయి. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు నాకు సలహాలు ఇచ్చి, పంట వేయించిన్రు.
అన్ని రకాల పంటల సాగు..
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా సైదాపూర్ మండల రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తుంటారు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పించినం. రైతులు అడిగిన సందేహాలను తీరుస్తూ అధిక దిగుబడి సాధించేందుకు సలహాలు ఇస్తున్నం. వేరుశనగకు అనుకూల వాతావరణం ఉంటే తప్పకుండా ఎకరానికి రూ.60వేల ఆదాయం వస్తుంది. వరితో పోలిస్తే ఏ రకం వేసినా లాభదాయకమే.
పొద్దుతిరుగుడు వేసిన..
నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. వానకాలంల వరి వేసిన. ఇప్పుడు ఎకరంన్నరలో వరి, రెండు ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో ఎకరంలో ఇతర పంటలు వేసిన. పొద్దుతిరుగుడు పంట మరో 40 రోజులలో చేతికి వస్తుంది. చేను మంచిగా ఉంది, నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా కేంద్రం వరి వద్దన్నందుకే ఇతర పంటలు పెట్టిన.
10 ఎకరాల్లో కుసుమ..
పెర్కపల్లిలో రైతు ఆంజనేయులు తన 10 ఎకరాల్లో కుసుమ సాగు చేశాడు. ఈ పంట అతి తక్కువ పెట్టుబడితో చేతికి వస్తుంది. నల్లరేగడి నేల అనుకూలం. వర్షాలు తగ్గిన తర్వాతనే సాగు చేయాలి. విత్తిన తర్వాత వానలు పడితే పంట అక్కరకు రాదు. వర్షం పడ్డ తర్వాత ఆ తడికి విత్తనాలు వేస్తే మంచిగా మొలకెత్తడమే కాకుండా కలుపు కూడా పడదు. వర్షానికి విత్తనాలు వేసినా, ఇంత వరకు నీటి తడి ఇవ్వలేదు. ఎర్ర నేలలకు రెండు తడులు చాలు. పెట్టుబడి చాలా తక్కువగా అవుతుంది. నల్లరేగడిలో రసాయన ఎరువులు పెద్దగా వాడాల్సిన అవసరం లేదు.