
ఇటీవల 317 జీవో ప్రకారం జరిగిన బదిలీల ప్రక్రియలో సంగారెడ్డి జిల్లాలోని మారుమూలగా ఉన్న నారాయణఖేడ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. గతంలో ఈ ప్రాంతంలో పనిచేయడానికి ఉపాధ్యాయులు ఆసక్తి చూపేవారు కాదు. దీంతో ఇక్కడి పాఠశాలల్లో విద్యాబోధన సరిగా సాగేది కాదు. ఈ సారి మాత్రం 134 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, 158 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం విశేషం. ఇటీవల చేపట్టిన బదిలీల ప్రక్రియతోనే ఇది సాధ్యమైంది. మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలు తిరిగి యథావిధిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యా బోధనకు పునరుజ్జీవం పోసినైట్లెంది.
నారాయణఖేడ్, జనవరి 20: సంగారెడ్డి జిల్లాలోనే మారుమూల ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం బదిలీలు జరిగిన ప్రతీసారి చర్చనీయాంశంగా మారేది. గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియలో భాగంగా తమకు అనుకూలమైన స్థానాలను ఎంచుకోవడం, ఫలితంగా నారాయణఖేడ్ ప్రాంతంలోని ఖాళీ స్థానాలు భర్తీకి నోచుకోని పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ప్రభుత్వం బదిలీల ప్రక్రియలో పలు మార్పులు తెచ్చి జోన్ల వారీగా బదిలీలు చేపట్టడంతో ‘అంటరాని’ ప్రాంతాలుగా మిగిలిపోతున్న నారాయణఖేడ్ వంటి నియోజకవర్గాలకు మేలు జరిగింది. గతంలో సమైక్య రాష్ట్రంలో నత్తనడకన సాగిన అభివృద్ధి కారణంగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడం, మరికొన్ని పాఠశాలలు సంవత్సరాంతం విద్యావలంటీర్లతో కొనసాగించే అనివార్య పరిస్థితులు ఉండేవి. తాజాగా జరిగిన బదిలీల పుణ్యమా అని మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలు తిరిగి యధావిధిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. దీంతో ఆయా పాఠశాలల్లో బోధనకు పునరుజ్జీవం పోసినైట్లెంది. ఇందులో భాగంగా నాగల్గిద్ద మండలంలోని కేశ్వార్, శాంతినగర్ తండా, శ్యామతండా, రత్నానాయక్ తండాలు విద్యా వలంటీర్ల ద్వారా కొనసాగించగా, తాజాగా నిర్వహించిన బదిలీల్లో ఆయా పాఠశాలలకు ఒక్కో ఉపాధ్యాయుడు నియమితులయ్యారు. ఇదీ కాక బదిలీలు జరిగిన ప్రతిసారి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆయా పాఠశాలలకు నిరాశే ఎదురయ్యేది. బదిలీ ప్రక్రియలో భాగంగా ఇక్కడి నుండి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగాను, ఇక్కడికి బదిలీపై వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండడం తత్ఫలితంగా స్థానికంగా అనేక ఖాళీలు మిగిలిపోయేవి. అయితే ఈసారి మాత్రం 134 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, 158 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి బదిలీపై రావడం విశేషం. 317 జీవో ప్రకారం జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా నారాయణఖేడ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరిందని చెప్పడంలో సందేహం లేదు.