షాబాద్, సెప్టెంబర్ 29 : పాలీహౌస్లో జెర్బారాసాగుతో లాభాలు కురిపిస్తున్నాయి. మూడు నెలలు కష్టపడితే ఆదాయం సమకూరుస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాదు… పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రతి ఒక్కరూ అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఉద్యాన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నది. మార్కెట్లో అలంకరణ పూలకు పెరుగుతున్న గిరాకీ రైతులను ఆలోచింపజేసింది. తక్కువ శ్రమ అధిక లాభాలు రావడం గమనించి వెంటనే పాలీహౌస్ సాగు చేపడుతున్నారు. అనతికాలంలో ఆర్థికాభివృద్ధి సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. షాబాద్ మండలంలోని ఎర్రొనిగూడ, నాగరగూడ, కక్కులూర్, హైతాబాద్, షాబాద్ తదితర గ్రామాల్లో రైతులు జెర్బారా పూల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లోకి వస్తున్న అలంకరణ పూలలో 90 శాతం బెంగుళూరు, మహారాష్ట్ర, పూణే నుంచి దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ ఉన్న పూలను ఇక్కడ ఎందుకు సాగు చేయకూడదనే ఆలోచనతో కొంతమంది రైతులు అలంకరణ పూలసాగు చేపట్టారు. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో మండలంలో రైతులు పాలీహౌస్ విధానంలో జెర్బారా, కార్నేషన్, కట్ప్లవర్స్ పూల సాగు చేపడుతున్నారు.
ఒక్కసారి పెడితే ఐదేండ్లు వరకు రాబడి…
ఎండ తీవ్రత, అధిక వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పాలీహౌస్ విధానంతో పూల సాగు చేయవచ్చు. ఇందుకు ఖర్చు బాగానే అయినా.. రైతులకు ఎంతో లాభాసాటిగా ఉంది. పాలీహౌస్ విధానంలో అలంకరణ పూల సాగు చేపట్టాలంటే ఎకరాకు రూ. యాభై లక్షల వరకు ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం పాలీహౌస్ విధానంలో పూల సాగు చేపట్టే రైతులకు తగు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. 50శాతం రాయితీపై పాలీహౌస్ ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు అందజేస్తున్నది. రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.
ఆదాయం అధికమే…
పాలీహౌస్ ద్వారా చేపట్టిన పూలసాగులో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రోజుకు 500 వరకు పూలు వస్తాయి. సీజన్లో ఒక్కో పువ్వు రూ. 15 నుంచి రూ.20 వరకు ధర పలుకుతున్నది. మిగతా రోజుల్లో రూ. 10 నుంచి రూ. 12 వరకు ధర పలుకుతున్నది. సీజన్ లేని సమయంలో వ్యాపారులు పూలను కొనుగోలు చేసి తమిళనాడు, చెన్నై తదితర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఎకరం పూల సాగు ద్వారా రోజుకు రూ. 2వేలు, నెలకు రూ. 50వేల వరకు ఆదాయం వస్తున్నది. అందులో ఖర్చు రూ. 10 వేలు పోగా రూ. 40 వేల వరకు రైతుకు ఆదాయం చేతికొస్తున్నది. పాలీహౌస్పై వేసే పాలిషీట్స్ ఐదేండ్ల వరకు ఉంటుంది. ఇనుప పైపులకు సుమారు 25 ఏండ్ల వరకు మన్నిక ఉంటుంది.
ఎరువుల వినియోగం తక్కువే…
సాంప్రదాయ పంటలతో పోల్చితే వీటికి ఎరువుల వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. పూలమొక్కలు నాటే ముందు 25 ట్రాక్టర్ల పశువుల ఎరువుకు రూ. 20 వేల వరకు ఖర్చు వస్తుంది. మొక్కలకు పోషక పదార్థాలు అందించే ఎరువులు వేసుకోవడానికి రూ. 3 వేల వరకు ఖర్చు వస్తుంది. నాటిన వారం రోజుల తరువాత డ్రిప్ ద్వారా రసాయనిక ఎరువులు అందించాల్సి ఉంటుంది. ఈ విధమైన సాగుతో చీడపీడల, తెగుళ్ల బెడద ఉండదు. గాలి, వాతావరణం మార్పుల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉండదు. కలుపు సమస్య అసలే ఉండదు. కేవలం ఇద్దరు కూలీలు, రోజుకు రెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది. దీంతో మండల రైతులు ఎక్కువగా పాలీహౌస్లతో పూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
పూలసాగులో లాభాలున్నాయి
పాలీహౌస్ ద్వారా పూలసాగు చేపట్టడంలో మంచి లాభాలున్నాయి. ప్రభుత్వం 50శాతం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహించడం బాగుంది. నేను ఎకరం పొలంలో పాలీహౌస్ ద్వారా పూలసాగు చేపట్టాను. పెండ్లిళ్ల సీజన్లో పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మార్కెట్లో మంచిగానే ధర పలుకుతుంది. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ. 30వేల వరకు ఆదాయం వస్తుంది.