ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ఎస్‌హెచ్‌జీలకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, పావలా వడ్డ్డీ తదితర పథకాల ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చి మహిళలు సుస్థిర జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నది. అంతేకాకుండా వారు ఎంచుకున్న వ్యాపారంలో శిక్షణ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. గతేడాది 11,400 సంఘాలకు రూ.485 కోట్లు మంజూరు చేయగా.. ఈసారి ఇప్పటివరకు 4,469 సంఘాలకు రూ.181కోట్లు మంజూరు చేసింది. ఒక్కో వ్యాపారానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల రుణం అందిస్తున్నది. ఇప్పటికే చాలామంది మహిళలు వ్యాపారాలు మొదలు పెట్టి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1924 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు వివిధ వ్యాపారాల్లో స్థిరపడి మంచి లాభాలు పొందుతున్నారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాల్లో మెళకువలు నేర్పుతుండడంతో మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నారు.
నాతోపాటు
నేను 2009 సంవత్సరం నుంచి సరోజిని మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. మొదట రూ.5వేలు బ్యాంకు ద్వారా రుణం తీసుకొని టైలరింగ్ మొదలుపెట్టా. ఇప్పటివరకు రూ.2 లక్షల 60వేల రుణం తీసుకొని టైలరింగ్ దుకాణాన్ని విస్తరించాను. ప్రస్తుతం నేను ఉపాధి పొందడంతోపాటు మరో పదిమందికి పని కల్పించాను.
రంగారెడ్డి, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ) : గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, పావలా వడ్డీ రుణాలతో పాటు వివిధ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందజేస్తూ ఆర్థిక భరోసానిస్తున్నది. గతంలో గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ఒకరిద్దరు సభ్యులు మాత్రమే రుణాలు తీసుకునేవారు. వారు కూడా పంట పెట్టుబడికి, అత్యవసరానికి, ఆ కుటుంబాలు చేసిన అప్పులను తీర్చేందుకుగాను వినియోగించేవారు. తదనంతరం తీసుకున్న రుణాల మొత్తాన్ని అతి కష్టం మీద చెల్లించేవారు. ప్రతి ఏటా కోట్ల రుణాలను అందజేసినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టిని సారించింది. రుణాలను సరైన సమయానికి చెల్లిస్తూ వస్తున్న సంఘాల సభ్యులతోపాటు వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి రుణాలను మంజూరు చేస్తున్నది. వారు ఎంచుకునే వ్యాపారానికి సంబంధించిన మెళకువలపై శిక్షణ ఇప్పించి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ప్రభుత్వ పథకాలతో రుణాలు పొందిన సభ్యులు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందుతుండటం గమనార్హం.
గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారాల నిమిత్తం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నది. గతేడాది 13,822 సంఘాలకు రూ.481 కోట్ల రుణాలు, ఈ ఆర్థిక సంవత్సరం 16,672 సంఘాలకుగాను రూ.579 కోట్ల రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4469 సంఘాలకు రూ.181 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న ముగ్గురు సభ్యుల చొప్పున ఎంపిక చేసి, వ్యాపారాలను ప్రారంభించేందుకుగాను అవసరమైన నైపుణ్యం, ఆర్థిక వనరులను సమీకరించి సుస్థిర జీవనోపాధిని ప్రభుత్వం కల్పిస్తున్నది. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో 760 గ్రామసంఘాలు ఉండగా, 20,294 స్వయం సహాయక సంఘాలు, 2,25,018 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 760 సంఘాల్లోని 3176 సభ్యులను గుర్తించి వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధులతో పాటు ఎస్‌హెచ్‌జీల సొంత నిధులను కేటాయించి బిజినెస్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలతోపాటు వాణిజ్య, సేవా పరమైన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1924 మంది సభ్యులు నూతనంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు నష్టపోకుండా వారు ఎంచుకున్న వ్యాపారాలకు సంబంధించి వ్యాపార మెళకువలు, నైపుణ్యాన్ని కూడా సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాల విషయంలో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణనిప్పించారు. ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం చేసేందుకు వీలు లేకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రతీ సభ్యురాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా ప్రణాళికను రూపొందించారు. అయితే గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పేపర్ ప్లేట్ల తయారీ, బేకరీ, విస్తరాకుల తయారీ యంత్రం, మగ్గం పనులు, పాపడ్, స్నాక్స్ యూనిట్, డిటర్జెంట్ పౌడర్, కిరాణ దుకాణం, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డెయిరీ, పౌల్ట్రీ, హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, వాటర్ ప్లాంట్, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్, మొబైల్ ఫోన్ మెకానిక్, మెడికల్ షాప్, టెంట్ సప్లయ్ సర్వీసులకు సంబంధించిన వ్యాపారాలను మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్నారు.
బ్యాంక్ లింకేజీ నుంచి రూ.లక్ష రుణం పొందాను. రోల్డ్ గోల్డ్, ఫాన్సీ ఐటమ్స్ వ్యాపారం ప్రారంభించాను. నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నా. ప్రస్తుతం ఎవరినీ అప్పు అడగాల్సిన అవసరం లేదు. స్త్రీనిధి బ్యాంక్ నుంచి రూ.40 వేలు అప్పు తీసుకుని వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నా.
రూ.5వేలు రుణం తీసుకుని లేడీస్ కార్నర్ పెట్టుకున్నా. బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించినందుకు వారు తిరిగి రుణాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు రూ.లక్షా 35వేలు తీసుకున్నా. సర్కార్ ప్రోత్సాహంతో ఉపాధి లభిస్తున్నది.
గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా ఎదుగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సెర్ప్ ఆధ్వర్యంలో వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చిన సభ్యులకు రుణాలను మంజూరు చేస్తున్నాం. ఆయా వ్యాపారాల్లో మెళకువలు తెలిసేలా శిక్షణ ఇప్పించాం.
ప్రభుత్వం ఇచ్చిన రూ.2లక్షల, 50వేల రుణం తీసుకుని క్లాత్ స్టోర్ పెట్టాను. మిషన్ కుట్టడంతో పాటు బట్టలు అమ్మడం వల్ల వ్యాపారం బాగా నడుస్తున్నది. ప్రభుత్వం నుంచి వడ్డీలేని రుణం తీసుకున్నందువల్ల వ్యాపారంలో నిలదొక్కుకుని లాభాలు పొందాను.
మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర సర్కార్ రుణాలను అందజేస్తుండటంతో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం. తక్కువ వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలను తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటుండటంతో పాటు పలువురికి ఉపాధి లభిస్తున్నది. తెలంగాణ సర్కార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.