మొయినాబాద్, ఆగస్టు 27 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మండలంలోని అజీజ్‌నగర్ గ్రామం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామం అద్భుతంగా మారింది. ప్లాస్టిక్ వాడకాన్ని అరికడుతున్నారు. ప్రత్యేక పద్ధతిలో యంత్రం సాయంతో పొడి చెత్తను కాల్చివేస్తున్నారు. రూ.1.72 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టడంతో పల్లె పట్టణాన్ని తలపిస్తున్నది. అనుబంధ గ్రామం బంగాలిగూడతో కలుపుకుని అజీజ్‌నగర్ గ్రామ పరిధిలో 15 వేల జనాభా, 1300 వరకు గృహాలు ఉన్నాయి. నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను వేయడంతో రాత్రి వేళలో జిగేల్మంటున్నాయి. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. గ్రామ రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణం పూర్తి కాగా, అందుబాటులోకి వచ్చింది.
సుమారు రూ.4 కోట్ల విలువ చేసే అర ఎకరం ప్రభుత్వ భూమిలో వివిధ రకాల 2000 మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పల్లె ప్రకృతివనంలో వాకింగ్ ట్రాక్‌లనూ ఏర్పాటు చేశారు.
పారిశుధ్యంపై గ్రామ పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి వీధిని శుభ్రం చేయగా వచ్చిన చెత్తతో పాటు ఇంటింటికీ వెళ్లి సేకరించగా, నిత్యం 500 కిలోల తడి, 500 కిలోల పొడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. రూ.8 లక్షలతో కంపోస్టు ఎరువు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
కంపోస్టు ఎరువు తయారీకి గండిపేట, వెల్ఫేర్ సొసైటీ వారు ముందుకొచ్చి రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. రూ.18 లక్షల ఎంపీ నిధులతో ఇన్సిరేటర్ యంత్రాన్ని కొనుగోలు చేశారు. నిత్యం పొడి చెత్తను కాల్చి ఎరువుగా తయారు చేస్తున్నారు. ఇందుకు ఆరుగురు సిబ్బందిని పెట్టారు. ఈ ఎరువును గ్రామ రైతులకు అందిస్తున్నారు. 25 కిలోల ఎరువు బస్తాను రూ.2500లకు విక్రయించాలన్న నిబంధన ఉన్నా, గ్రామ రైతులకు రూ.1250లకే ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రామంలో పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నాం. డంపింగ్ యార్డు స్థలం, రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటాం. నిత్యం ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు పోస్తున్నాం. తడి, పొడి చెత్తను దగ్ధం చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ‘పల్లె ప్రగతి’తో గ్రామం అద్భుతంగా తయారైంది. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్తను సేకరిస్తున్నాం. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు వినియోగంలోకి వచ్చాయి. వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకున్నాం.