‘పల్లెప్రగతి’తో మారిన మక్తగూడ గ్రామ రూపురేఖలు
రూ. 5కోట్లతో అభివృద్ధి పనులు
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరా
రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనం
నర్సరీలో 8వేల మొక్కలు సిద్ధం
వినియోగంలోకి వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
స్వచ్ఛతలో ఆదర్శంగానిలుస్తున్న గ్రామం
షాబాద్, ఆగస్టు 26: గ్రామాలను స్వచ్ఛత దిశగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యక్రమం అమలుచేస్తున్నది. దీంతో మారుమూల గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ పంచాయతీలకు ప్రతి నెలా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్రామాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీలు ఏర్పాటు చేయడంతో స్వచ్ఛత దిశగా మారుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా షాబాద్ మండలంలోని మక్తగూడ గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
ప్రగతిలో పచ్చందాలు
మక్తగూడ గ్రామంలో మొత్తం 652 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.54 వేలు నిధులు వస్తున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.11లక్షలతో వైకుంఠధామం, రూ.3.50 లక్షలతో కంపోస్టు షెడ్డు నిర్మించారు. 25 గుంటల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, 1500 వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీలో 8వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో రోడ్లకు ఇరువైపులా మరో 3500 మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో ఇండ్ల వద్ద నుంచి తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు.
రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు
మక్తగూడ గ్రామంలో రూ.5 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.2.30 కోట్లతో గ్రామానికి వెళ్లే వాగుపై బ్రిడ్జి నిర్మించి ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించారు. రూ.2.40 కోట్లతో గ్రామానికి బీటీ రోడ్డు, రూ.50 లక్షలతో అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు వేయించారు. రూ.20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలోని 160 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి రోజూ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో గ్రామం అభివృద్ధి చెందింది.
ప్రగతి పనులు పూర్తి చేశాం
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో అన్ని రకాల పను లు పూర్తి చేశాం. నర్సరీలో 8వేల మొక్కలు, 25 గుం టల భూమిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 1500 మొక్కలు పెంచుతున్నాం. పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నాం. తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించి, కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నాం. గ్రామాన్ని ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, మక్తగూడ
ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. రెండు పర్యాయాలుగా సర్పంచ్‌గా సేవ చేస్తున్నా. వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వ సహకారంతో రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేయించాం. రూ.70లక్షలతో గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం. రూ.2.30 కోట్లతో బీటీ రోడ్డు వేయించాం. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.