రంగారెడ్డి జిల్లాలో 52,621 ఎకరాల్లో బిందుసేద్యం
ఈ పద్ధతిలో సాగుపై 34,468 మంది రైతుల ఆసక్తి n తక్కువ నీటితో ఎక్కువ విస్త్తీర్ణంలో సాగు
రైతు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి
షాద్‌నగర్, ఆగస్టు 26: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దీటుగా రైతులు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ శాస్త్రీయ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి పొందాలనే ఉద్దేశంతో రైతులు బిందు సేద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానవన పంటలతో పాటు పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలను సైతం బిందు సేద్యం పద్ధతిలో సాగుచేస్తూ, అధిక లాభాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉద్యానవన రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. నీటి వృధా అరికట్టడంతో పాటు కూలీల కొరతను అధికమించి, సాగు ఖర్చు తగ్గించుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బిందు సేద్యం ద్వారా రైతులకు శ్రమ కూడా తగ్గుందని భావిస్తున్నారు. భూగర్భ జలా లు తక్కువ ఉన్నా బిందు సేద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
23 మండలాల్లో 34,468 మంది రైతుల ఆసక్తి
బిందు సేద్యంతో సాగు చేసేందుకు అన్ని వర్గాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, శేరిలింగంపల్లి మండలాలు మినహా మిగతా 23 మండలాల్లో సుమారు 34,468 మంది రైతులు బిందు సేద్యం ద్వారా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు, ఇతర వాణిజ్య పంటలు, పాలీహౌస్‌ల సాగు, పందిరి సాగు ద్వారా 52,621 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగు చేస్తున్నారు. మొయినాబాద్, ఫరూఖ్‌నగర్, చేవెళ్ల, కేశంపేట, షాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కొందుర్గు, కొత్తూ రు మండలాల్లో ఉద్యానవన రైతులు బిందు సేద్యం పద్ధతిలో పంటలు సాగుచేసి, లబ్ధిపొందుతున్నారు. బిందుసేద్యం పద్ధతిలో 29,279 ఎకరాల్లో పండ్ల తోటలు, 17,772 ఎకరాల్లో కూరగాయల పంటలు, 4,082 ఎకరాల్లో పూలతోటలు, 443 ఎకరాల్లో ఇతర ప్రత్యేక ఉద్యాన వన పంటలు, 242 ఎకరాల్లో పాలీహౌస్ ఉద్యానవన పంటలు, 763 ఎకరాల్లో పందిరి సాగు పంటలు, 40 ఎకరాల్లో ఔషధ మొక్కలు సాగు చేస్తున్నారు. పోల్చుకుంటే గడిచిన ఏడేండ్లలో బిందు సేద్యం పద్ధతిలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని ఉద్యానవన శాఖ అధికారులు చెపుతున్నారు.
ఈ పంటలకు లాభం
బిందు సేద్యంతో అధిక లాభాలు పొందాలంటే రైతులు కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టమాట, చిక్కుడు, మిరప, దొండ, బీర, ఆనుగపుకాయ, క్యాప్సికమ్ వంటి కూరగాయల పంటలతోపాటు పత్తి, ఆముదం, చెరుకు, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి వాణిజ్య పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందుతారు. మామిడి, బత్తాయి, బొప్పాయి. అరటి, ద్రాక్ష వంటి పండ్లతోటల సాగుకు బిందు సేద్యం పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుంది. వేసవిలో బిందు సేద్యం ద్వారా పూలతోటలు సాగు చేస్తే అధిక లా భాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయని ఉద్యానవనశాఖ అధికారులు సూచిస్తున్నారు. పందిరి, పాలీహౌస్‌ల ద్వారా సాగయ్యే పంటలకు బిందు సేద్యం వరంలా భావించవచ్చని చెబుతున్నారు.
రైతులకు సర్కారు చేయూత
రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలో బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నది. బిందు సేద్యం సాగుపై క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నీటి కొరత, ఎరువుల వినియోగం తగ్గుదల, కూలీల సమస్యకు పరిష్కారం, కలుపు నివారణకు మార్గాలు ఏవిధంగా ఉంటాయో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిందు సేద్యం ద్వారా సాగు చేసుకునే రైతులకు రాయితీలో సేద్య పరికరాలను పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులు 5 ఎకరాల్లోపు పొలం ఉన్నవారికి 100 శాతం రాయితీతో పరికరాలు అందిస్తారు. ఓసీ, బీసీలకు 90 శాతం సబ్సిడీతో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులకు పదెకరాల్లో పొలం ఉన్నవారికి 75శాతం రాయితీతో రూ.లక్షకు మించకుండా సూక్ష్మ సేద్య పరికరాలను వ్యవసాయశాఖ అందిస్తున్నది.
బిందు సేద్యంతో లాభాలు
వ్యవసాయంలో ప్రధానంగా నీటి ఉపయోగం అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా నీటిని పూర్తిస్థాయిలో ఆదా చేసుకుని ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటి సరఫరా మోతాదు రూపంలో ఉంటుంది, దీంతో పంట దిగుబడి అధికంగా వస్తుంది. దీంతోపాటు నీరు ఆదా అవుతుంది. సాధారణ సాగుతో పోల్చితే బింధుసేద్యంలో 30శాతం అధిక దిగుబడులు వస్తాయి. విద్యుత్ కోతల సమస్యతో ఇబ్బందులు పడకుండా సకాలంలో పంటలకు నీరు అందించవచ్చు. విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ఈ పద్ధతిలో కలుపు నివారణ అదుపులో ఉండడంతో కూలీల కొరత ఉన్నప్పుడు కూడా సమస్య ఉండదు. ఎరువులను నీటి ద్వారానే అందించడంతో పంటలకు పూర్తిస్థాయిలో చేరి, అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి.
రైతుల ఆలోచనలు మారుతున్నాయి
నేటితరం రైతులు తమ సాగు విధానాలను మార్చుకుంటున్నారు. పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడి పెంచుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాల రైతులు బిందు సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో డబ్బులు, నీళ్లు, సమయం అదా అవుతున్నాయి. ఫలితంగా రైతులకు లాభాలు కనిపిస్తాయి. ఈ పద్ధతిలో సాగుచేసేందుకు రైతులు మరింత ఆసక్తి చూపాలి. సర్కారు రాయితీలో బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నది.