ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 : జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీతోపాటు కార్పొరేషన్లకు కూడా ఈ నెలాఖరు నాటికి వైకుంఠరథాలను కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగా సాధారణ నిధుల నుంచి వీటిని కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లాలోని 15 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఈ నెలాఖరు నాటికి వైకుంఠ రథాలను కొనుగోలు చేయాలని ఆదేశాలందాయి. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైకుంఠధామాలను కూడా పూర్తిచేశారు. చివరి మజిలి సాఫీగా జరుగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా వైకుంఠధామాల నిర్మాణంతోపాటు వైకుంఠరథాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన వైకుంఠరథాలు కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్లల్లో రెండు మూడు వరకు వైకుంఠరథాలను అందుబాటులో ఉంచాలని, మేజర్ మున్సిపాలిటీల్లో రెండు, చిన్న మున్సిపాలిటీల్లో ఒక వైకుంఠరథం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ నెలాఖరు నాటికి ఉచిత సేవలందించేందుకు వైకుంఠరథాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని 15 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లల్లో ప్రస్తుతం ఒకటి రెండు అందుబాటులో ఉండగా ఇవేమాత్రం సరిపోవడంలేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని కొత్తవాటిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాలను తరలించేందుకు వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ప్రతి మున్సిపాలిటీ తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
వైకుంఠరథాలను కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఒక్కో వైకుంఠరథానికి రూ.8లక్షల నుంచి రూ.14లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. చిన్న మున్సిపాలిటీల్లో ఆదాయం అంతగా లేకపోతే రూ.8లక్షలు.. అత్యాధునిక వసతులతో కూడిన వైకుంఠరథాలకు 14 లక్షలు వినియోగించవచ్చు. కార్పొరేషన్లల్లో ఎక్కువ వైకుంఠరథాలు అవసరం ఉన్నందున రెండు నుంచి మూడు కూడా కొనుగోలు చేసుకునేందుకు అవకాశాలున్నాయి.
కొనుగోలు చేసిన వైకుంఠరథాల నిర్వహణ పూర్తిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే భరించాల్సి ఉంటుంది. మృతదేహాలను ఉచితంగా తరలించడానికి ఈ రథాలను ఉపయోగించి సేవలందించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరణించిన వారి సమాచారం ముందస్తుగా సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాహనాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. పెట్రోల్, డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులను కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే భరిస్తాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.