నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవలే సీడీపీ నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి రూ.5కోట్లు ఇవ్వనుండగా.. మొదటి విడుతగా ప్రస్తుతం 50శాతం అంటే రూ.2.5కోట్లు అందజేసింది. వికారాబాద్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు, ఒకరు ఎమ్మెల్సీ ఉండగా మొత్తం రూ.12.50కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడుత నిధులు త్వరలోనే అందించనున్నది. ఈ నిధులను గిరిజన తండాల అభివృద్ధికి 10 శాతం, ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు 20 శాతం మేర వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అదేవిధంగా 40 శాతం నిధులు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో సౌకర్యాల కల్పనకు కేటాయించాల్సి ఉంది. ఈ నిధులతో నియోజకవర్గాలను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి/వికారాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీపీ(నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) కింద ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.5కోట్ల చొప్పున నిధులను ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రస్తుతానికి 50 శాతం నిధులను విడుదల చేసింది. మిగతా 50 శాతం నిధులను త్వరలోనే విడుదల చేయనుంది. ప్రతి ఏటా రంగారెడ్డి జిల్లాకు రూ.55 కోట్లు, వికారాబాద్‌కు రూ.40 కోట్లు అందించనుంది. గతంలో సీడీపీ కింద రూ.3 కోట్ల నిధులను ఇస్తుండగా.. గత నెలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తుల మేరకు రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు గత రెండేండ్లుగా కరోనా ప్రభావంతో సీడీపీ నిధులు మంజూరు చేయని ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు, వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పట్నం మహేందర్‌రెడ్డి, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా వాణీదేవి, బి.దయానంద్ (వికారాబాద్), ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీగా యెగ్గే మల్లేశం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా కింద కె.జనార్దన్‌రెడ్డి(రంగారెడ్డి) ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిధుల విడుదల, వినియోగంపై ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో అధిక ప్రాధాన్యత ఎస్సీ, ఎస్టీ జనాభాగల ప్రాంతాలకు ఇవ్వనున్నారు. గిరిజన తండాలతోపాటు ఎస్సీ కాలనీల్లో సీడీపీ నిధులను అధికంగా ఖర్చు చేస్తారు. తండాలు, ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రోడ్లు, డ్రైనేజీ తదితరాల అభివృద్ధికి నిధులను వెచ్చించనున్నారు. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేసి ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతారు. గిరిజన తండాల అభివృద్ధికి 10 శాతం నిధులను, ఎస్సీ కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకుగాను 20 శాతం మేర నిధులను వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీడీపీ నిధుల్లో 40 శాతం నిధులు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అదనపు గదుల నిర్మాణంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఆట స్థలాల అభివృద్ధి, సైన్స్ ప్రయోగశాల, తాగునీటి వంటి మౌలిక వసతులకు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడెక్కడ అదనపు గదుల అవసరం, శిథిలావస్థకు చేరిన భవనాలు తదితర వివరాలను ఇప్పటికే జిల్లాల విద్యాశాఖ అధికారులు సేకరించారు. ఆయా నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అవసరమయ్యే మౌలిక వసతులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందజేసినట్లయితే నిధుల విడుదల చేయనున్నారు. ఇవేకాకుండా అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, ప్రభుత్వాసుపత్రుల మరమ్మతులకు సంబంధించి నిధులు ఖర్చు చేస్తారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే విజ్ఞప్తులను స్వీకరించి ప్రభుత్వానికి చేరవేసేందుకు సీపీవోలు కసరత్తు చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పల్లెలను సందర్శించినప్పుడు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులతోపాటు ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సీడీపీ నిధులు కూడా రూ.5లక్షలు దాటితే ఆ పనికి కచ్చితంగా టెండర్ ద్వారా చేపట్టాల్సి ఉంది. రూ.5లక్షల లోపు పనులు అయితే నామినేషన్‌పై చేసుకోవడానికి వీలుంది. గతంలో సీడీపీ నిధుల్లో సగం, మిగతా సగం సంబంధిత జిల్లా మంత్రి ద్వారా పనులకు ప్రతిపాదనలు పంపి వ్యయం చేసేవారు. ప్రస్తుతం నిధులు విడుదల కావడంతో పల్లెల్లో సమస్యల పరిష్కారానికి, సామాజిక భవనాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నారు. మురుగు కాలువలు, సీసీ రోడ్లు, మంచినీటి కల్పన, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, దోబీ ఘాట్లు, గ్రంథాలయాలు, వివిధ కులాలకు సామాజిక భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించనున్నారు.
వికారాబాద్ జిల్లాకు ఇద్దరు ఇన్చార్జి మంత్రులను నియమించారు. జిల్లా మంత్రి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించగా, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఈ ఏడాది మొదటి విడుతగా వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతోపాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి రూ.12.50 కోట్ల నిధులు విడుదల కానున్నాయని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) మోహన్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి విడుదలైన సీడీపీ నిధులు రూ.2.50కోట్లతో నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తాం. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు, శానిటేషన్ పనులు చేపడుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల నియోజకవర్గానికి ఇప్పటికే అత్యధికంగా నిధులు తీసుకువచ్చాం. మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తాం : అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరాయి. మిగతా అభివృద్ధి పనులను చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇటీవల విడుదల చేసిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చిస్తాం. ప్రతి పైసా ప్రజలకు సంపూర్ణంగా ఉపయోగపడేలా ఖర్చుచేస్తాం.