నోరూరించే వంటకాలు
తినడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్శకులు
పలు ప్రాంతాల నుంచి వస్తున్న జనం
జీవనోపాధి పొందుతున్న గిరిజనులు
వారాంతాల్లో గిరిజనులకు చేతినిండా పని
అమ్మవారి దర్శనానికి వెళుతూ ఆర్డర్ ఇస్తున్న భక్తులు
తిరుగు ప్రయాణంలో కడుపునిండా తింటున్న జనం
నగరానికి సమీపంలో ఉండటంతో ప్రతీ వారం పెరుగుతున్న సందర్శకులు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడుపుతున్న వైనం
పిక్నిక్ స్పాటుగా మారుతున్న మైసిగండి ప్రాంతం
నాటుకోడి కూరతో జొన్నరొట్టె తింటే భలేగుంటది… చూస్తే నోరూరిపోవాల్సిందే.. ఈ వంటకాన్ని రుచి చూసేందుకు భోజన ప్రియులు అమితాసక్తిని చూపిస్తారు. కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం గిరిజనులు రుచికరమైన నాటుకోడి కూర, జొన్నరొట్టెలను సిద్ధంగా ఉంచుతున్నారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న మైసిగండి ఆలయం నగరానికి 50 కి.మీ దూరంలోనే ఉంటుంది. దీంతో నగరవాసులతో పాటు పలు ప్రాంతాల నుంచి ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. గిరిజనులు చేసే కమ్మని వంటకాన్ని తినేందుకు ముందుగానే ఆర్డర్ ఇచ్చి ఆలయానికి వెళ్తుంటారు. తిరిగి వచ్చిన తర్వాత నాటు కోడి కూర, జొన్నరొట్టెలను తిని సరదాగా గడుపుతున్నారు. 300 గిరిజన కుటుంబాలకు చేతి నిండా పని దొరుకుతున్నది. మైసిగండి ప్రాంతం పిక్నిక్స్పాటుగా అభివృద్ధి చెందుతున్నది.
కడ్తాల్, ఆగస్టు 21 : తెలంగాణ రాష్ట్రం వంటలకు పెట్టింది పేరు. తెలంగాణ వంటకాల రుచి చూడాలని ఎంతో మంది ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. స్వరాష్ట్రం సిద్ధించాక వంటలకు సరైన ప్రాధాన్యం లభిస్తున్నది. ప్రసిద్ధి చెందిన నాటుకోడి, జొన్న రొట్టెను కూడా రుచిచూడాలని ఎంతో మంది భోజన ప్రియులు ఆసక్తి చూపుతారు. నాటుకోడి కోసం ప్రత్యేకంగా పలు ప్రాంతాల నుంచి గ్రామాలకు తరలి వస్తుంటారు. అలాంటి నాటుకోడి, జొన్న రొట్టె కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండిలో భోజన ప్రియులకు అందుబాటులో వుండడం విశేషం.
పేదల ఇలవేల్పుగా మైసిగండి మైసమ్మ ఆలయం
మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత పేదల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం నగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో వుండటంతో దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆది, మంగళ, గురువారాల్లో ఆలయం భక్త జనంతో రద్దీగా కనిపిస్తున్నది. ఈ ప్రసిద్ధ ఆలయం వద్ద భోజన ప్రియులకు రుచికరమైన నాటుకోడి, జొన్నరొట్టె వంటకం లభిస్తుండటంతో భక్తులు ఇక్కడికి రావడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రత్యేకంగా నాటుకోడి, జొన్నరొట్టెలు చేయించుకొని విందులు ఆరగిస్తుంటారు.
వంటలతో జీవనోపాధి
మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేకించి హోటళ్లు, మెస్‌లు ఏమి ఉండవు. ఇక్కడికి వచ్చేవారి కోసం గిరిజనులు వంటలను సిద్ధం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. సుమారు మూడు వందల గిరిజనుల కుటుంబాలు భక్తులకు వంటకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గిరిజనులు చుట్టు పక్కల గ్రామాలు తిరిగి నాటుకోళ్లను కొని, ఆలయ పరిసరాల్లో అమ్మడంతోపాటు, నోరూరించే వంటను సిద్ధం చేస్తుంటారు. వంటలు చేసినందుకు భక్తుల వద్ద వీరు రూ.200 నుంచి రూ.500 వరకు తీసుకుంటారు. ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుడటంతో, ఒక్కో గిరిజన కుటుంబం సుమారు రూ.2 వేల వరకు సంపాదిస్తుంటారు.
అరగంటలో నాటుకోడి కూర రెడీ
మైసిగండికి వచ్చే భక్తులు ఎక్కువగా నాటుకోడి కూరను తినడానికి ఇష్టపడుతుంటారు. అరగంటలోనే నాటుకోడి కూరను తయారు చేస్తాం. అన్ని వసతులు కల్పిస్తూ పసందైన భోజనాన్ని అందిస్తున్నాం. ఇలా మాకు జీవనోపాధి దొరుకుతున్నది.
-జ్యోతి, మైసిగండి.
ఉపాధి పొందుతున్నాం…
అమ్మవారి దయ వల్ల మైసిగండి ఆలయ ఆవరణలో వంటలు చేస్తూ ఉపాధి పొందుతున్నాం. మైసిగండి వద్ద ప్రత్యేకంగా లభించే జొన్నరొట్టెలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఆరగిస్తుంటారు. ప్రతిరోజూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నాం. నాటుకోడి, జొన్నరొట్టెలతోపాటు, భోజనాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తాం.
-జాజా, గిరిజన మహిళ, మైసిగండి