ఒంటికర్రతో పదెకరాల్లో వరి సాగు
రోగనివారణకు జీవన ఎరువులు
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్న రైతు
డ్రమ్ సీడర్ సహాయంతో విత్తనాలు
బండరాయితో కలుపుతీత
120 రోజుల్లోనే చేతికొస్తున్న పంట
ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి
రామాయంపేట, అగష్టు 21 :వెద పద్ధతిలో సేంద్రి య వరి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు కిష్టపురం శ్రీనివాస్. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవడం, ఆరోగ్యకర ఆహారాన్ని అందించాలని ఆయన తనకున్న పదెకరాల్లో ఈ విధానంలో వరి పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రామాయంపేట పట్టణానికి చెందిన రైతు కిష్టపురం శ్రీనివాస్ తనకున్న పదెకరాల పొలంలో వరిసాగు చేస్తున్నాడు. వృత్తిరీత్యా స్వర్ణకార పనులను చేసే వ్యాపారి. దశాబ్ద కాలంగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. వృత్తిని పక్కనబెట్టి తన అనుభవంతో స్వగ్రా మంలో స్వయంగా వ్యవసాయం చేయాలని నిర్ణ యించుకున్నాడు. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటను ఎంచుకున్నాడు. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకుని ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చే జీవన ఎరువులతో పదెకరాల్లో ఒంటికర్ర వరిసాగు పద్ధతిన పొలంలో నాటేశాడు. బోరుబావిలో నీరు తక్కువగా రావడంతో వరి మడులకు సకాలంలో నీరందించడం కోసం రెండు నీటినిల్వ గుంతలను ఏర్పాటు చేసి, ప్రతిరోజు పంటకు నీరందిస్తున్నాడు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. వరిపంట పురుగుబారిన పడకుండా పంటచేలలో దోమల నివారణకు డబ్బాలను ఏర్పాటు చేశాడు. పంటపై పిట్టలు ఇతర జీవరాసులు రాకుండా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశాడు. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిన పదెకరాల్లో పంట పచ్చగా కనిపిస్తున్నది.120 రోజుల్లో పంట చేతికి రానున్నది. ఎకరాకు దిగుబడి 60 బస్తాలు వచ్చే అవకాశం ఉంది.
పురుగు మందులులేని పంట
పురుగు మందులు లేని పంట పం డించాలని అనుకున్నా. పదెకరాల్లో ఒంటి కర్ర, వెదజల్లే పద్ధతితో వరి పంట పండిస్తున్నా. సేంద్రియ ఎరువులతో పండిస్తున్నా. వరి పంటకు వచ్చిన ధాన్యపు గింజలను రామాయంపేటలో విక్రయిస్తున్నా. అధికారులు ఉచితంగా జీవన ఎరువులను అందజేశారు. పంటను కాపాడుకునేందుకు రెండు నీటికుంటలను ఏర్పాటు చేశా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ సేంద్రియ ఎరువులతో పంటలను పండించాలి.
కిష్టపురం శ్రీనివాస్, రైతు
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
ఈసారి ఎక్కువ శాతం రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపారు. మండలంలో 14వేల పైచిలుకు ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించాం. ఈపంటకు ఖ ర్చు చాలా తక్కువ. దిగుబడి మాత్రం ఎక్కువ వస్తున్నది. ఒంటికర్ర వరిసాగుకు పొలాలను తడిపితే సరిపోతుంది. ఈ పంటకు ఎండుతెగులు, కాండం తొ లుచే పురుగు ఆశిస్తుంది. వెంటనే సేంద్రియ ఎరువులు చల్లాలి. 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
-రాజ్నారాయణ, వ్యవసాయ శాఖ అధికారి