రెండు రోజుల్లో కొలిక్కి…
ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను ఎంఈవోల నుంచి సేకరణ బడుల మూసివేత లేకుండా పోస్టుల సర్దుబాటు దిశగా కసరత్తు 50లోపు విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమాన్ని మరో పాఠశాలకు మార్చేందుకు నిర్ణయం మిగులు పోస్టులను ఇతర పాఠశాలలకు కేటాయింపు టీచర్ పోస్టుల వివరాలను సేకరిస్తున్న విద్యాశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఊపందుకున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి.. ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారు.. విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను మండలాలవారీగా విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ లెక్కలు తేలే అవకాశం ఉన్నది. 50లోపు విద్యార్థులు ఉన్న ఆంగ్ల మాధ్యమాన్నిమరో పాఠశాలకు మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రాథమిక పాఠశాలల్లో 19 లోపు విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 60లోపు ఉన్న పాఠశాలలకు ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉంటే అందుకనుగుణంగా టీచర్లను నియమించనున్నారు. బడుల మూసివేత లేకుండా పోస్టుల సర్దుబాటుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల వివరాలను ఎంఈవోల నుంచి సేకరిస్తున్న విద్యాశాఖ
బడుల మూసివేత లేకుండా కసరత్తు 50లోపు విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమాన్ని మరో పాఠశాలకు మార్చేలా ప్రభుత్వం నిర్ణయం మిగులు పోస్టులను ఇతర పాఠశాలలకు కేటాయింపు
రంగారెడ్డి, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియ కసరత్తు వేగంగా జరుగుతున్నది. ముందుగా జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారనేది జిల్లా విద్యాశాఖ అధికారులు లెక్క తీస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతోపాటు ఉపాధ్యాయ పోస్టుల వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి విద్యాశాఖ అధికారులు నివేదించనున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కచ్చితమైన వివరాలపై రెండు రోజుల్లో లెక్కతేల్చనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియతో ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడేందుకు ఆస్కారం లేదు. మిగులు పోస్టుల ఆధారంగా బదిలీలు జరిగే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విద్యార్థులను బట్టి ఉపాధ్యాయుల సర్దుబాటు
ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియతో స్కూళ్ల మూసివేతనే ప్రసక్తే ఉండదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 0-19 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని, 60లోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఇద్దరు చొప్పున, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు, ఈ విధంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఉన్నత పాఠశాలల్లో అయితే 0-220 మంది విద్యార్థులుంటే 9 మంది ఉపాధ్యాయులు, 250లోపు విద్యార్థులుంటే 10 మంది ఉపాధ్యాయులు, 280 మంది విద్యార్థులున్న పాఠశాలలకు 11 మంది ఉపాధ్యాయులు, 310 మంది విద్యార్థులుంటే 12 మంది ఉపాధ్యాయులు, 340లోపు విద్యార్థులున్న పాఠశాలలకు 14 మంది ఉపాధ్యాయులు ఉండేలా నిర్ణయించనున్నట్లు జిల్లా విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియకు 2020-21 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని చేయనున్నారు. ఏదేని పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నట్లయితే మిగులు పోస్టుల కింద తీసుకొని మరో పాఠశాలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా 50 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను మరో పాఠశాలలో కలుపనున్నారు. ఇప్పటివరకు కొనసాగిన ఆంగ్ల మాధ్యమం సెక్షన్ను మాత్రమే తీసేసి మరో పాఠశాలలో చేర్చనున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1313 ఉండగా, 1,51,086 మంది విద్యార్థులున్నారు.
రెండు రోజుల్లో పూర్తి లెక్క తేలనుంది : డీఈవో సుశీంద్రరావు
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని మంజూరైన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పోస్టుల వివరాలతోపాటు విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాం. ఏయే పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులకు ఎంత మంది ఉపాధ్యాయులున్నారనే కచ్చితమైన వివరాలు రెండు రోజుల్లో తేలనుంది. సంబంధిత వివరాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి అందజేస్తాం. విద్యార్థుల సంఖ్యను పోస్టుల సర్దుబాటు ప్రక్రియ ఉండనుంది.