షాబాద్, ఆగస్టు 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించిన సర్కార్ ప్రతిరోజు పంచాయతీ సిబ్బందితో గ్రామాలను శుభ్రం చేయిస్తున్నది. షాబాద్ మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులు మొత్తం పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నది. పల్లెప్రగతిలో చేపట్టిన వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు, హరితహారం నర్సరీ, పల్లెప్రకృతి వనం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రోజూ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రజల ఇండ్ల వద్ద నుంచి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రకృతివనంలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. దీంతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి.
గ్రామంలో 1013 జనాభా ఉన్నది. ఇంతకు ముందు మన్మర్రి గ్రామ పంచాయతీకి అనుబంధ ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిన్న పల్లెలను పంచాయతీలుగా మార్చడంలో భాగంగా అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ గ్రామాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి ప్రతినెలా రూ. 80వేల నిధులు ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ నిధులతో పంచాయతీ ట్రాక్టర్ నెలవారి కిస్తులు, పంచాయతీ సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. రూ. 11.20లక్షలతో గ్రామంలో వైకుంఠధామం, రూ. 93వేలతో కంపోస్ట్‌యార్డు, 30 గుంటల ప్రభుత్వ భూమిలో రూ. 1.20లక్షలతో పల్లెప్రకృవనం ఏర్పాటు చేసి అందులో 10 రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారం నర్సరీలో 12వేల మొక్కలు పెంచారు. గ్రామంలోని ఆయా కాలనీల్లోని రోడ్లకు ఇరువైపులా మొత్తం 1000 మొక్కలు నాటి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పచ్చదనం పెంపులో ప్రజలు భాగస్వాములవుతున్నారు.
అప్పారెడ్డిగూడ గ్రామంలో రూ. 15లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.5లక్షలతో సీసీ రోడ్లు, రూ.3లక్షలు జిల్లా పరిషత్ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.7.50లక్షల జీపీ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో గ్రామం పూర్తిగా పరిశుభ్రంగా మారింది. మొక్కలు నాటడంతో పచ్చదనం ఏర్పడింది. గ్రామంలో ప్రతి నెలా ఆసరా పథకం ద్వారా 100 మందికి పింఛన్లు అందుతున్నాయి. గ్రామంలో మొత్తం 163 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ప్రభుత్వం నుంచి ఆరుగురికి కల్యాణలక్ష్మి, ఒకరికి రైతుబీమా సాయం అందింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారాయి.
గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చిగ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
-పోలేపల్లి పూజిత, సర్పంచ్ , అప్పారెడ్డిగూడ
గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులు పూర్తి చేశాం. వైకుంఠధామం, కంపోస్యార్డు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేపట్టి కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నాం. పల్లెప్రకృతివనంలో 3వేల మొక్కలు పెంచుతున్నాం. నర్సరీలో 12వేల మొక్కలు పెంచాం. పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటి సంరక్షించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
-హరిశంకర్, పంచాయతీ కార్యదర్శి