పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ సూచిస్తున్నది. జిల్లాలో డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి శుక్రవారం వైద్య సిబ్బంది పల్లెపల్లెకు వెళ్లి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోదోమల నివారణకు ఫాగింగ్‌తో పాటు మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. ‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమంతో గతంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు బాగా తగ్గినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 112 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయని, వైరల్ ఫీవర్స్‌లో ఒక్క శాతమే డెంగీ ఉన్నదని తెలిపారు. ఎవరికైనా ఫీవర్ ఉన్నట్లు సమాచారం ఇస్తే వెంటనే వెళ్లి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. డెంగీ వ్యాధి సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా యంత్రాంగం పేర్కొంటున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ): జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో ఏ మారుమూల గ్రామంలోనైనా సీజనల్ వ్యాధుల బారిన పడినట్లు సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి వారికి సరైన చికిత్స అందించడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మురుగునీరు రోడ్లపై పారడం తదితర కారణాలతో దోమల వ్యాప్తి పెరిగి డెంగీతోపాటు మలేరియా, టైపాయిడ్, డయేరియా, స్వైన్‌ఫ్లూ, కలరా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో జిల్లాలో డెంగీ, స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదైన దృష్ట్యా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన వైరల్ జ్వరాల్లో ఒక్క శాతం మాత్రమే డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 112 డెంగీ కేసులు నమోదుకాగా, మలేరియా 2 కేసులు నమోదయ్యాయి. ప్రతి గ్రామం, పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకుగాను రాష్ట్ర సర్కార్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల వ్యాధుల ప్రభావం చాలా తగ్గినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో డెంగీ నివారణకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఇంటింటికెళ్లి నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మురుగు కాలువల్లో థిమో పాసెస్ స్ప్రే చేయడంతోపాటు గ్రామాల్లో దోమలను అరికట్టేందుకు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేస్తున్నారు. మురుగు నీటి కాలువల్లో దోమల లార్వాను నాశనం చేసేందుకు ఆయిల్ బాల్స్‌ను వేస్తున్నారు. అంతేకాకుండా గంబూసియా చేపలను కూడా మురుగు కాలువల్లో వేస్తున్నారు. వాతావరణంలో మార్పులు, పారిశుధ్యం, దోమలు వ్యాప్తి చెందడం, ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ప్రజలు డెంగీ బారిన పడుతున్నారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, అవగాహన, సరైన సమయానికి చికిత్స తీసుకోవడమే డెంగీ నివారణ మార్గమని వైద్యారోగ్య అధికారులు సూచిస్తున్నారు. దోమల నుంచి రక్షించుకునేందుకుగాను ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడడంతోపాటు శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. డెంగీ పాజిటివ్ అని తేలినట్లయితే విశ్రాంతి తీసుకోవడంతోపాటు గోరువెచ్చని నీటిని తీసుకోవడంతోపాటు మంచి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల నివారణ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంతోపాటు అన్ని పీహెచ్‌సీలు, బస్స్టాండ్లు, , మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల్లో సంబంధిత సిబ్బంది ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడంతోపాటు సకాలంలో చికిత్స అందించేలా చూడాలని లేనట్లయితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ప్రతి రోజు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుతోపాటు ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడినట్లయితే సంబంధిత సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల వారీగా ఓఆర్ఎస్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తరుచుగా తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షిస్తున్నారు. క్లోరినేషన్ టాబ్లెట్లను ప్రతి గ్రామం, తండాల్లోనూ పంపిణీ చేస్తున్నారు.
డెంగీ సోకినప్పటికీ ఆందోళన పడోద్దని ప్రజలకు జిల్లా వైద్యారోగ్య శాఖ సూచిస్తున్నది. ప్లేట్లెట్స్ 25 వేలకు తగ్గినప్పటికీ తిరిగి పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ప్లేట్లెట్స్ తగ్గడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, వైద్యుడి పర్యవేక్షణలో ఉంటే ఏం కాదని చెబుతున్నారు. మొదట మూడు రోజుల్లో డెంగీ సోకినట్లు నిర్ధ్దారణకు రాలేం.. తర్వాత మూడు రోజులు ప్లేట్లెట్స్ తగ్గుతాయి.. శరీరంపై ఎర్రని మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అదేవిధంగా కేవలం అశ్రద్ధతోనే డెంగీ మరణాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో డెంగీ నివారణకు కావాల్సిన మందులు సరిపోను ఉన్నాయి. కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రితోపాటు ఏరియా దవాఖానల్లో, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సరిపోను డెంగీ నివారణ మందులను జిల్లా వైద్యారోగ్య శాఖ నిల్వ ఉంచింది.
డెంగీపై ఆందోళన పడొద్దు. డెంగీ నిర్దారణ అయిన వెంటనే వైద్యుడి పర్యవేక్షణలో ఉంటే ప్రాణానికి ప్రమాదమేమీ ఉండదు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. తినేముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. వేడి, వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. అదేవిధంగా ఆహార పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.