పల్లె ప్రగతితో సమస్యలకు చెక్
రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు
ప్రత్యేక ఆకర్షణగా పల్లెప్రకృతి వనం
ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు
కడ్తాల్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి అనుబంధంగా ఉన్న న్యామతాపూర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామంలో 309 ఇండ్లు, 1,350 జనాభా, 849 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ముందు ఊరంతా చెత్తాచెదారంతో, రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా ఉండేవి. కొన్ని కాలనీలు పాడుబడిన ఇండ్లు, పాత బావులతో కళావిహీనంగా ఉండేవి. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊరంతా మారిపోయింది. గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌తో రోజూ పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. దీంతో కాలనీల్లో చెత్తా చెదారం, మురుగు కనుమరుగయ్యాయి. రూ.48 కోట్ల వ్యయంతో కడ్తాల్- షాద్‌నగర్ బీటీ రోడ్డు పూర్తికావడంతో గ్రామానికి రాకపోకలు సాగుతున్నాయి.
పల్లెప్రగతి కార్యక్రమంతో న్యామతాపూర్ గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డును నిర్మించారు. రూ.3 లక్షలతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, అందులో 2 వేల మొక్కలు నాటారు. వీటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదాం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.30 లక్షలతో రెండు వాటర్ ట్యాంక్‌లు నిర్మించారు. రూ.2 లక్షలతో ప్రతి కాలనీలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. పంచాయతీలో రూ.35 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. హరితహారం మొక్కలకు ట్యాంకర్‌తో మొక్కలకు రోజూ నీరు పోసి, సంరక్షిస్తున్నారు.
అభివృద్ధిలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామస్తుల సహకారంతో అన్ని వి ధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్ర భుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. న్యామతాపూర్ను పంచాయతీగా ఏర్పాటు చేయడంతో, ప్రతి నెలా జీపీకి వచ్చే నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వం మంజూరు చేసి న నిధుల గురించి గ్రామసభల్లో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాం. వాటిని పక్కాగా వినియోగిస్తున్నాం. దీంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం.