రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలు
రంగారెడ్డిలో జాతీయ జెండాను ఎగురవేయనున్న మంత్రి సబితారెడ్డి వికారాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రదర్శనకు ఆయా శాఖల స్టాళ్లు, శకటాలు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అందించనున్న
ప్రశంసాపత్రాలు ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ నారాయణ, జిల్లా యంత్రాంగం పరిశీలన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్, మంత్రి సబితారెడ్డి
వికారాబాద్, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ): పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాల కోసం ఏర్పాట్లను కలెక్టర్ పౌసుమిబసు పరిశీలించారు. గ్రౌండ్లో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, మైక్, వీఐపీ సిట్టింగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సుందరీకరణ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ పరేడ్ రిహారల్స్ను ఎస్పీ నారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ముఖ్యఅతిథి బస కోసం చేసిన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎస్పీ నారాయణ, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, తాసిల్దార్ రవీందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయుధ పోలీసు బలగాల రిహార్సల్‌ను అధికారులు తిలకించారు. రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి టి.పద్మారావుగౌడ్ ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.40 లకు జిల్లా ప్రగతిని వివరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాల ప్రదానం చేస్తారు.
రంగారెడ్డి, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ): నేడు జరుగనున్న స్వాతంత్య్ర దిన వేడుకలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా శాఖలు స్టాళ్లు, శకటాలను ప్రదర్శించనున్నారు.