కోట్‌పల్లి, ఆగస్టు 14: పలు అభివృద్ధి పనులతోపాటు పచ్చదనం, పరిశుభ్రతతో ఎన్నారం గ్రామంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. తెలంగాణను హరితమయం చేసేందుకు సీఎం కేసీఆర్ పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి పెట్టారు. దీంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్, మొక్కల పెంపకంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, పరిశుభ్రతతో స్వాగతం పలుకుతున్నది.
కోట్‌పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలో 560 ఇండ్లు, 456 కుటుంబాలు, 3 వేల జనాభా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ, పల్లె ప్రకృతి వనం, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు సర్పంచ్ సావిత్రిగౌడ్. గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, నూరుశాతం మరుగుదొడ్లు పూర్తిచేశారు. గ్రామానికి రెండు దిక్కులా ఉన్న రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. పరిశుభ్రత, పచ్చదనం వంటి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి గ్రామాన్ని ప్రగతిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
గ్రామంలో రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించారు. జడ్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, జీపీ నిధులు రూ.65 లక్షలతో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్లు వేయించారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2.5 లక్షలతో పార్కు అభివృద్ధి, రూ.50 వేలతో నర్సరీ అభివృద్ధి చేశారు. రూ.10 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. రూ.లక్షతో పాడుబడిన ఇండ్లు తొలగించారు. గ్రామంలోని గుంతల పూడ్చేశారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పంచాయతీ సిబ్బందితో వీధులు శుభ్రం చేయిస్తున్నారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీని కోనుగోలు చేశారు. నిత్యం గ్రామంలో సైరన్ వేసుకుని ఇంటింటికీ తిరుగు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, ఎరువులు తయారు చేసుకునేందుకు రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించుకున్నారు. ప్రతి ఇంటికి కొత్త వెలుగులు అందించాలనే భావనతో పాత స్తంభాలు తొలగించి, వాటి స్థానంలో కొత్తగా 117 స్తంభాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు విద్యుత్ సరఫరి ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గ్రామంలో ఎకరం ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో ఉదయం, సాయంత్ర వాకింగ్, వ్యాయామాలు చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. ప్రకృతి వనంలో వివిధ రకాలైన 2 వేల మొక్కలు నాటారు. టేకు, చింత, జామ, నీలగిరి, దానిమ్మ, ఉసిరి, చైనా బాదాం, మందారం, కానుగ తదితర మొక్కలు నాటి, వాటికి రోజూ నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు.
పార్టీలతీతంగా గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామాన్ని నందన వనంగా మార్చుకున్నాం. పాడుబడిన ఇండ్లు, బావులను తొలగించాం. ఎప్పటికప్పుడు చెత్త, మురుగును క్లీన్ చేయిస్తున్నాం. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. గ్రామం ఎటుచూసినా పచ్చని చెట్లు, పరిశుభ్రతలో కళకళలాడుతున్నది. ఎన్నారం గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిదుతా. – సావిత్రిగౌడ్, సర్పంచ్, ఎన్నారం
అందరి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. పల్లె ప్రగతిలో అందరిని భాగస్వామ్యం చేస్తు, ముందుకు సాగుతున్నాం. సమస్యలు లేని, శుభ్రమైన గ్రామంగా మార్చినం. పారిశుధ్యం, చెత్త సేకరణ, పచ్చదనంపై ప్రత్యేక దృష్టిని సారించాం. ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేశాం. తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, స్వేంద్రియ ఎరువులు తయ్యారు చేస్తున్నాం. అప్పుడప్పుడు అధికారులు వచ్చిపోతుంటారు. వారి సలహాలు, సూచనలు తీసుకుని మరింత అభివృద్ధిని చేస్తుకున్నాం.