ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన పశు సంచార వాహనాలు మూగజీవాల పాలిట వరంలా మారాయి. మూగజీవాలకు సత్వర సేవలు అందించేందుకు 1962 నంబర్ గల వాహనాలను ప్రతి నియోజకవర్గానికి ఒకటిచొప్పున అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో నేడు మారుమూల గ్రామాల్లోని మూగజీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే రైతులు 1962 నెంబర్ను సంప్రదిస్తున్నారు. వెంటనే ఈ వాహనం ద్వారా సిబ్బంది చేరుకుని సత్వర వైద్యసేవలు అందిస్తుండడం ఆనందంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలకు ఎలాంటి ప్రమాదమున్నా, ప్రసవ సమయంలో ఇబ్బంది ఉన్నా వెంటనే రైతులు 1962 వాహనాలకు కాల్ చేస్తున్నారు. ఈ వాహనాలు సంఘటనా స్థలాలకు చేరుకుని చికిత్సలు అందిస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా మూగజీవాలకు కూడా వైద్యం అందించడం సంతోషించదగ్గ విషయమని రైతాంగం చెబుతున్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 5 పశుసంచార వాహనాలతో 35వేల మూగజీవాలకు 1962 వాహన సిబ్బంది చికిత్సలు అందించినట్లు జిల్లా అధికారి రమేశ్ తెలిపారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రమాదాల్లో ఉన్న ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలను 1962 పశుసంచార వాహనం ద్వారా వైద్యసేవలు అందించి మూగజీవాలను కాపాడగలిగామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా క్షణాల్లో చేరుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చి 1962 పశుసంచార వాహనంలో మూగజీవాలకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు మైక్రోస్కోప్, ట్రైమాక్వాన్, ఆక్సిజన్ సప్లయ్ పరికరం, చిల్లక్టీకా స్కోప్, గ్లూకోజ్ బాటిళ్లు, మందులతో పాటు సంచార వాహనంలో పశువైద్యాధికారితో పాటు ప్యారాస్టాప్, అటెండర్, పౌలెట్ నాలుగురితో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వీరు పశువులకు అవసరమైన చికిత్సలను వాహనం ద్వారా అందజేస్తారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న 5 పశుసంచార వాహనాల ద్వారా ఈ ఏడాది 35 వేల మూగజీవాలను కాపాడగలిగాం. ఈ వాహనాలు 108 తరహాలో సరైన వైద్యసేవలందిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తమకు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్సలు అందిస్తున్నాం. ఈ సంచార వాహనాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు వైద్య చికిత్సలకు సంబంధించిన అన్ని పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచాం. మూగజీవాల కోసం కేటాయించిన ఈ వాహనాల ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.