కోహెడ, ఆగస్టు 14 : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మొదటి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన మహిళ, అదే ప్రియుడు డబ్బుల కోసం వేధిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రియుడు తనను కూడా చంపుతాడని భయపడి, అసలు విషయం చెప్పింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన చౌహాల్ ప్రఫుల్ (29) జ్యోతి దంపతులు ఉపాధి రీత్యా హైదరాబాద్ శివారు బొల్లారం ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి క్యాతం కృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రఫుల్ భార్య జ్యోతితో కృష్ణ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం ప్రఫుల్కు తెలియడంతో కృష్ణను హెచ్చరించాడు. మే 6వ తేదీన కృష్ణ మద్యం తాగి వచ్చి, ప్రఫుల్తో గొడవ పడ్డాడు. మందు సీసాతో ప్రఫుల్ను హతమార్చాడు. వెంటనే కృష్ణ, జ్యోతి కలిసి ప్రఫుల్ మృతదేహాన్ని గోనె సం చిలో కట్టి, ఆటోలో కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామ శివారు గుట్టల్లో(శనిగరం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం)లో జేసీబీతో తీసి ఉన్న గుంతలో పూడ్చి పెట్టారు. ప్రఫుల్ బంధువులు జ్యోతిని ప్రఫుల్ విషయంపై ఆరా తీయగా, కరోనా వచ్చి చనిపోయాడని తెలిపింది. ఎలాగోలా వారికి ఉన్న పరిచయాలతో కరోనా వచ్చినట్లు సర్టిఫికెట్ సంపాదించింది. కరోనాతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఇదిలా ఉండగా, ఇన్సూరెన్స్ డబ్బులు, కరోనాతో చనిపోయిన డబ్బులు ఏమైనా వచ్చాయా? అని జ్యోతిని కృష్ణ బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో తనను కూడా కృష్ణ చంపుతాడని జ్యోతి బయపడి, సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించింది. సంగారెడ్డి సీఐ ప్రశాం త్ సిబ్బందితో వచ్చి స్థానిక పోలీసులు, తహసీల్దార్ రుక్మిణికి సమాచారం ఇచ్చి మృతదేహాన్ని జేసీబీతో బయటికి తీయించారు. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో కుళ్లిన మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. హం తకుడు కృష్ణ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన వాడని తెలుస్తున్నది.