బడంగ్‌పేట,ఆగస్టు13: పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్‌పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించారు. 67 అంశాలపై చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, వరద కాల్వల నిర్మా ణం పై చర్చించారు.ప్రతి డివిజన్లో నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలు పెంచే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ప్రభుత్వం గ్రీనరీ కోసం పది శాతం నిధు లు కేటాయించిందన్నారు. మొక్కలను సంరక్షించే బాధ్యత కా ర్పొరేటర్లు తీసుకోవాలన్నారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రెండు కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లెలగూడలో ఒక శ్మశాన వాటిక, మీర్‌పేటలో మరో శ్మశాన వాటికను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు వైకుంఠ రథాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయనున్నట్లు వివరించారు. మూడు రిజర్వాయర్లను కొత్తగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఏడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ ఇస్తుందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో పది శాతం స్థానికులకు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.